కోహ్లీ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ రికార్డులను తిరగరాస్తుంటే ఎగిరి గంతేస్తాం. రోహిత్ శర్మ ఇంకో డబుల్ సెంచరీ కొట్టేస్తుంటే ఈలలతో గోలగోల చేస్తాం. మరి, మనమూ కోహ్లీలా, రోహిత్ శర్మలా క్రికెట్ ఆడేస్తే పోలా? అదేదో మామూలు గ్రౌండ్లో నలుగురు ఫ్రెండ్స్తోనో లేదంటే మొబైల్ ఫోన్లో గేమో ఆడినట్టు కాదు. చుట్టూ క్రికెట్ అభిమానుల గోలల మధ్య గ్రౌండ్లో సిక్సర్లు కొట్టేస్తే మజా ఎట్లుంటది? అది అయ్యే పని కాదంటారా.. కానీ, వర్చువల్ రియాలిటీ (వీఆర్)తో ఏదైనా సాధ్యమే అంటోంది ‘ఐబీ క్రికెట్’! అవును, మనం నిజంగా క్రికెట్ ఆడిన ఫీలింగ్ కలిగేలా హైదరాబాద్‌కు చెందిన ‘ప్రోయుగ’ అనే స్టార్టప్ వీఆర్ ఫార్మాట్లో ‘ఐబీ క్రికెట్’ను తీసుకొచ్చింది. గ్రౌండ్లో ఆడితే ఎట్లాంటి జోష్ ఉంటుందో అట్లాంటి జోష్‌ను క్రికెట్ఫ్యాన్స్ కోసం తెచ్చింది. ఆడ, మగ, వయసు తేడా లేకుండా ఎవరైనా మస్త్ జోష్‌తో గేమ్‌ను ఎంజాయ్ చేయొచ్చని చెబుతోంది.
మన చుట్టూ ఉండే పరిసరాలే ప్లేగ్రౌండ్
మన చుట్టూ ఉండే పరిసరాలనే ప్లేగ్రౌండ్‌గా మార్చేస్తుంది ఐబీ క్రికెట్. ఏదో ఒంటరిగా గేమ్ ఆడుతున్నామన్నట్టు కాకుండా, నిజమైన క్రికెట్లో ఎలాగైతే ఉంటుందో అలాంటి కిక్‌నే అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రపంచంలోని అత్యాధునికమైన స్టేడియాలలో ఆడేలా గేమ్‌ను తీర్చిదిద్దింది. సిక్స్ కొట్టినా, ఫోర్ బాదినా ప్లేయర్‌ను చీర్ చేసేలా లైవ్ కామెంటరీ కూడా ఉంటుంది. పిచ్, బౌలర్లు, స్కోర్‌బోర్డు వంటి ఫీచర్లతో రియల్ గేమ్ ఆడుతున్న అనుభూతిని ఇస్తుంది. పర్సనలైజ్డ్ ఏఐ కోచ్‌తో గేమ్‌లో లెవెల్సూ ఉంటాయి. ఐబీ హబ్స్ సాయంతో ఎక్స్ఆర్ టెక్నాలజీపై ఫోకస్డ్గా ప్రోయుగ కంపెనీని పెట్టారు ట్రిపుల్ఐటీ హైదరాబాద్ గ్రాడ్యుయేట్ వసంత్. కంపెనీలో ఐఐటీ, ఐఐఎంలకు చెందిన గ్రాడ్యుయేట్లూ ఉన్నారు. ఐఐటీ ఢిల్లీలో చదివిన త్రివిక్రమ్, కంపెనీ కోఫౌండర్, సీఈవోగా ఉన్నారు. ఓ ఎంఎన్సీ ఇచ్చిన కోటి రూపాయల ఆఫర్‌ను కాదనుకుని ఆయన ఈ కంపెనీలో భాగస్వాములయ్యారు.
ఎక్కడెక్కడున్నాయ్
ప్రస్తుతం ఇండియా సహా ఐదు దేశాల్లో ఐబీ క్రికెట్ తన ఆర్కేడ్లను స్టార్ట్ చేసింది. సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల్లో అవి ఉన్నాయి. ఇండియాలో 30 ఆర్కేడ్లున్నాయి. హైదరాబాద్‌లో గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, మదీనాగూడ, కొండాపూర్, సుచిత్ర, శేరిలింగంపల్లిల్లో 8 ఆర్కేడ్లున్నాయి. 35కు పైగా దేశాలకు చెందిన ప్రజలు 10 లక్షలకు పైగా బాల్స్‌ను ఆడారు. యువరాజ్‌సింగ్, జహీర్‌ఖాన్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, క్రిస్ లిన్, ఇయాన్ మోర్గాన్ వంటి స్టార్ క్రికెటర్లతో ఆడే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే, అది కేవలం ‘వర్చువల్ రియాలిటీ’లోనే అనుకోండి. ఐబీ క్రికెట్‌ను ఎంజాయ్ చేయాలంటే https://ib.cricket/vsport-arcades/ లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెప్పింది.
స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
‘ఆంత్రప్రెన్యూర్ ఇండియా 2019’ అవార్డుల్లో కంపెనీ స్టార్టప్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకుంది. పోయినేడాది జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, దుబాయ్, శ్రీలంకల్లో అభిమానుల కోసం ఈవెంట్లను నిర్వహించింది. చెన్నైసూపర్కింగ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి ఐపీఎల్ టీంలకు అఫీషియల్ వీఆర్గేమింగ్ పార్ట్నర్గా ఉంది. అంతేగాకుండా వ్యూతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ క్రికెట్ టోర్నమెంట్‘ఐబీ క్రికెట్ సూపర్ ఓవర్ లీగ్’ను ఐబీ క్రికెట్ నిర్వహించింది. వీరేందర్ సెహ్వాగ్, సురేశ్ రైనా, హెర్షెలే గిబ్స్, మెక్‌కలమ్ వంటి స్టార్లు అందులో పాల్గొన్నారు. గత ఏడాది ముగిసిన అబుధాబి టీ10 లీగ్‌కూ వీఆర్ క్రికెట్పార్ట్నర్గానూ పనిచేసింది. ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకూ వీఆర్ పార్ట్నర్గా ఉంది.


