V6 News

ప్రాజెక్టులు తగ్గాయి.. డిమాండూ తగ్గింది.. టాప్ ఐటీ ఇండియన్ కంపెనీల నుంచి..7 వేల మంది ఉద్యోగుల తొలగింపు

ప్రాజెక్టులు  తగ్గాయి.. డిమాండూ తగ్గింది.. టాప్ ఐటీ ఇండియన్ కంపెనీల నుంచి..7 వేల మంది ఉద్యోగుల తొలగింపు
  • 2025–26 లో నెమ్మదించిన హైరింగ్
  • పడిపోయిన డిమాండ్‌..తగ్గుతున్న ప్రాజెక్టులు
  • ఏఐ వాడకంపై కంపెనీలు మొగ్గు
  • టీసీఎస్‌, టెక్ మహీంద్రాలో జాబ్ కట్స్‌.. 
  • ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌లో హైరింగ్‌ స్లో 

న్యూఢిల్లీ: ఇండియన్ ఐటీ కంపెనీలు  2025–26 లో  వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి.  టీసీఎస్‌, ఇన్పోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్‌, టెక్ మహీంద్రా కలిపి ఏడు వేల మంది ఉద్యోగులను తగ్గించుకున్నాయి.  అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో (2024–25లో)ఇవి  12,718 మందిని  నియమించుకున్నాయి. టీసీఎస్‌  అత్యధికంగా 23,460 మందిని తొలగించగా, టెక్ మహీంద్రా 1,108 మందిని  తీసేసింది. వీటితో పోలిస్తే ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌  నియామకాలు జరిపినా, జోరు తగ్గింది. 

కొంప ముంచుతున్న ఏఐ

ఐటీ కంపెనీల డిమాండ్ పడిపోతోంది. గ్లోబల్ అనిశ్చితి వల్ల అమెరికా, యూరప్ క్లయింట్ల నుంచి ప్రాజెక్టులు రావడం లేదు. జియో పొలిటికల్‌ టెన్షన్లు, గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో ఇండియన్‌ కంపెనీల క్లయింట్లు ఐటీ ఖర్చులను తగ్గించుకుంటున్నారు. దీంతో ఖర్చులను తగ్గించుకోవడానికి, మార్జిన్లను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగులను తీసేస్తున్నారు. వీటికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరుగుతుండడంతో ఉద్యోగుల అవసరం తగ్గుతోంది.  ఇండియా ఐటీ  సెక్టార్‌‌లో హైరింగ్‌ యాక్టివిటీ 2023–24 స్థాయికి పడిపోలేదని, కానీ ట్రెండ్ చూస్తే నియామకాలు ఇప్పటిలో పుంజుకునే అవకాశం లేదని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో మనదేశ ఐటీ సెక్టార్‌‌లో 69 వేల  మంది ఉద్యోగాలు పోయాయి.   

చిన్న కంపెనీలే బెటర్​.. 

పెద్ద కంపెనీలు జాగ్రత్తగా హైరింగ్‌ చేపడతుండగా, మిడ్‌, స్మాల్ కంపెనీలు మాత్రం ఉద్యోగులను నియమించుకోవడాకి మొగ్గుచూపుతున్నాయి. ఇండస్ట్రీ ఆర్గనైజేషన్  నాస్కామ్‌ ప్రకారం,   ఈ ఏడాది  మొత్తం ఐటీ ఇండస్ట్రీలో  1.4 లక్షల కొత్త ఉద్యోగాలు రాగా, మొత్తం ఉద్యోగుల సంఖ్య 59 లక్షలకు పెరిగింది. ఈ పెరుగుదలలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) కీలక పాత్ర పోషించాయి.

ఈసారి కూడా మందకొడిగానే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో హైరింగ్ యాక్టివిటీ ఇంకా బలహీనంగానే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో  యాక్టివ్ టెక్ జాబ్ ఓపెనింగ్స్‌  1.1 లక్షలు మాత్రమే.  మార్చితో పోలిస్తే 8శాతం తగ్గాయి. ఐటీ సర్వీసెస్‌ సెగ్మెంట్‌లో ఓపెనింగ్స్‌ 43 వేలకి పడిపోయాయి. నెల ప్రాతిపదికన, ఏడాది లెక్కన 7 శాతం తగ్గాయి.   మొత్తం టెక్ హైరింగ్‌లో  ఐటీ సర్వీసెస్‌ వాటా 49 శాతానికి పడిపోయింది.  2025 డిసెంబర్‌ తర్వాత  50శాతం కంటే తగ్గడం ఇదే మొదటిసారి.

మెటా, ఒరాకిల్‌, మైక్రోసాఫ్ట్​లో  46,750 మంది ఇంటికి

గ్లోబల్‌ టెక్‌ కంపెనీలు   మెటా, ఒరాకిల్‌, మైక్రోసాఫ్ట్‌ కలిపి సుమారు 46,750 మంది ఉద్యోగులను ఈ ఏడాది తొలగించాయి.  మెటా 8 వేల ఉద్యోగాలను తగ్గిస్తూ, ఏఐలో 135 బిలియన్‌ డాలర్లను (రూ.12.69 లక్షల కోట్లను) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.  ఒరాకిల్‌ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సుమారు 30 వేల మంది ఉద్యోగులు ఒకేసారి లేఆఫ్‌ అయ్యారు. చాలా మంది ఉద్యోగులు ఉదయం ఈ–మెయిల్‌ ద్వారా టెర్మినేషన్‌ నోటీసులు అందుకున్నారు.  

మైక్రోసాఫ్ట్‌ మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకుంది. నేరుగా లేఆఫ్స్‌ చేయకుండా, సుమారు 8,750 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద రిటైర్మెంట్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఇది కంపెనీ చరిత్రలో తొలిసారి. ఏఐ కోసం డేటా సెంటర్లు, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఖర్చులు పెంచుతోంది. అలానే ఉద్యోగుల పనితీరును సమీక్షించడానికి కొత్త విధానాన్ని తెచ్చింది.

గత ఐదేళ్లలో (ఎఫ్‌వైల)లో నియామకాలు..

కంపెనీ    2026    2025    2024    2023    2022
టీసీఎస్    -23,460    6,433    -13,249    22,600    103,546
ఇన్ఫోసిస్      5,016    6,338    -25,994    29,219    54,396
విప్రో      8,810    732    -24,516    13,793    45,416
హెచ్‌సీఎల్‌      3,761    -4,061    1,537    17,067    39,900
టెక్ మహీంద్రా      -1,108    3,276    -6,945    1,227    30,119
మొత్తం    -6,981    12,718    -69,167    83,906    2,73,377