జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బావిలో ఈతకు వెళ్లి 13 ఏళ్ళ బాలుడు మృతి చెందాడు. ఆదివారం ( ఏప్రిల్ 26 ) జరిగిన ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. వెల్గటూర్ మండలం బీర్సని గ్రామానికి చెందిన కాంపెల్లి రితేష్ అనే బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ కి సెలవులు, పైగా ఆదివారం కావడంతో లొత్తునూర్ గ్రామంలో ఫ్రెండ్స్ తో కలిసి వ్యవసాయ బావిలో ఈతకు వెళ్ళాడు రితేష్. బావిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు.
నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన రితేష్ ఈత రాకపోవడంతో మృతి చెందాడు. పెళ్లి వేడుకకు సమీపంలో ఉన్న బావిలోనే ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇలా మృతి చెందడం చూసి తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది రితేష్ తల్లి. ఈ ఘటన చూసి గ్రామస్తులు సైతం చలించిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

