- ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు వెబ్సైట్ ఓపెన్
- మొదటగా ప్రతి ఇంటినీ ఎన్యూమరేట్ చేయనున్న అధికారులు
- 33 ప్రశ్నలకు సమాధానం కోరనున్న ఎన్యూమరేటర్లు
- 16 ఏండ్ల తర్వాత ఇండియాలో జనగణన
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మొదటి సారి..
- ఇతర సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్ 1855
- వివరాలు వెల్లడించిన భారతి హోళికేరి, ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నేటి నుంచి సెన్సెస్ ప్రక్రియ మొదలవుతుందని, మే 11 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేందుకు అవకాశం ఉందని తెలంగాణ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. ప్రతి ఇల్లూ, ప్రతి వ్యక్తి వివరాలను సేకరించేలా పకడ్బందీ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో జీహెచ్ఎంసీ కమిషనర్, సెన్సస్ క్యూర్ పరిధి స్పెషల్ ఆఫీసర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భారతి హోళికేరి మాట్లాడుతూ.. తెలంగాణలో తొలిసారి జనాభా లెక్కలు నిర్వహించేందుకు అంతా సిద్ధమైందని, ఫస్ట్‌టైమ్ జనగణనను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించబోతున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఇక్కడ జనగణన జరుగుతున్నదన్నారు. మొత్తం రెండు దశల్లో సెన్సెస్ జరగనుందని, మొదటి దశలో ఆన్ లైన్ లో డిటెయిల్స్ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్), ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరణలో భాగంగా బడి, గుడి, ఆస్పత్రి, గుడిసె, అద్దె ఇల్లు ఇలా ఇండ్ల గణన, రెండో దశలో వ్యక్తిగత సమాచారం సేకరించనున్నామని తెలిపారు.
మే 10 వరకు ఆన్ లైన్ డీటెయిల్స్
మొదటి దశ జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఈ నెల 26 (ఆదివారం) నుంచి మే 10 వరకు సొంతంగా ఆన్ లైన్ లో డీటెయిల్స్ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ఉంటుందని తెలిపారు. https://se.census.gov.in లో వివరాలు వ్యక్తిగతంగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందన్నారు. ఆ తర్వాత మే 11 నుంచి జూన్ 9 వరకు ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని, తుది దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనగణన జరుగునుందని తెలిపారు.
వివరాలు ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. తొలిదశ జనాభా లెక్కల ప్రక్రియలో 33 ప్రశ్నలకు జవాబులు సేకరించనున్నామని, ఆన్‌లైన్‌లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే వారు కేవలం 27 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని, మిగిలిన 6 సంబంధించిన వివరాలను, రెండో దశలో ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి నేరుగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని, ఎక్కడా పెన్నూ కాగితం వాడరని చెప్పారు.
ఎన్యూమరేటర్లు స్మార్ట్ ఫోన్‌లోని మొబైల్ యాప్ ద్వారా ఫ్యామిలీల సమాచారాన్ని నమోదు చేసుకుంటారని తెలిపారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా సమర్పించేందుకు ఉద్దేశించిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్ సహా 16 భాషల్లో లభ్యమవుతుందని చెప్పారు. మొబైల్ నంబర్, ఇతర మౌలిక వివరాలను పోర్టల్‌లో పేర్కొన్న తర్వాత ప్రతి కుటుంబానికి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ లభిస్తుందని వివరించారు. ఎన్యూమరేటర్ క్షేత్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఐడీ చెబితే ఏమైనా సవరణలు ఉంటే చేయడానికి అవకాశముందన్నారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు 15 రోజులు కేటాయించగా తర్వాత నెల రోజులు ప్రత్యక్షంగా ఇంటింటి వివరాల సేకరణ జరుగుతుందని, జనగణనకు సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా 1855 హెల్ప్ లైన్ నంబర్ లో సంప్రదించాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హెల్ప్ లైన్ నంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. వ్యక్తిగత సమాచారం చాలా భద్రంగా ఉంటుందన్నారు. అలాగే ఎక్కడ ఉండేవారు అక్కడే నమోదు చేసుకోవాలన్నారు. నగరంలో ఉంటున్న వారు ఇక్కడ చేసుకుంటే సరిపోతుందన్నారు. ప్రభుత్వ పథకాలకు సెన్సెస్ కు సంబంధంలేదన్నారు. ప్రతి ఒక్కరు తమ వివరాలు అందించి సహకరించాలన్నారు. వివరాలు ఇవ్వని వారిపై చర్యలు కూడా తీసుకునే వెసులు బాటు ఉందన్నారు.
క్యూర్ పరిధిలో యూనిట్ గా జనగణన: ఆర్వీ కర్ణన్
కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) యూనిట్ గానే జనగణన జరుగుతుందని ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాల్లోని 60 సర్కిళ్లు, 300 వార్డులతోపాటు కంటోన్మెంట్ బోర్డు ఏరియాలో జనగణన జరుగుతుందన్నారు. ఒక్కో సర్కిల్ కు చార్జ్ ఆఫీసర్ గా డిప్యూటీ కమిషనర్ వ్యవహరించనున్నారని తెలిపారు. వార్డు యూనిట్ గా హౌస్ లిస్టింగ్ చేయనున్నారని తెలిపారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రిన్సిపల్ సెస్సెస్ ఆఫీసర్ గాను, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు అడిషనల్ సెన్సెస్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారని తెలిపారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆదివారం నుంచి మే10 వరకు జరుగుతుందని తెలిపారు. హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతుందని చెప్పారు. జనగణన 9 ఫ్రిబవరి2027 నుంచి 28వ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు. జనగణనలో ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు.
మొత్తం 61 చార్జ్ అధికారులు, సుమారు 21,866 మంది ఎన్యుమరేటర్లు ఈ సెన్సస్ కోసం సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో 19,865 బ్లాకులను డిజిటల్ పద్ధతిలో గుర్తించినట్లు తెలిపారు. స్కూల్ పిల్లలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు.
సెల్ఫ్ ఎన్యుమరేషన్ సౌకర్యాన్ని వాడుకోవాలని, మీ ఇంటి నుండే సులభంగా వివరాలు నమోదు చేసి, మన నగరం కోసం నిర్మించే డేటాబేస్‌లో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, సినీ, రాజకీయ ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

