అప్పుడెప్పుడో 1996లో చూశాం వరల్డ్‌కప్‌లో కొత్త విజేతను. లాహోర్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఉపఖండ జట్టు శ్రీలంక చాంపియన్‌గా నిలిచింది. అది జరిగి రెండు దశాబ్దాలైంది. ఈలోపు ఐదు ప్రపంచకప్‌లు జరిగాయి. కానీ, పాత కాపులే కప్పు కొట్టేసారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ విశ్వ సమరంలో.. క్రికెట్ పుట్టినింట కొత్త చాంపియన్ పురుడు పోసుకోనుంది.
మూడోసారి ప్రపంచాన్ని జయించాలని చూసిన ఇండియాకు షాకిచ్చిన న్యూజిలాండ్, ఆరో టైటిల్‌పై గురిపెట్టిన ఆస్ట్రేలియాను అడ్డుకున్న ఇంగ్లండ్ ‘పన్నెండో వరల్డ్ వార్’లో అంతిమ సంగ్రామానికి రెడీ అయ్యాయి. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఈ రెండు జట్ల మధ్య నేడే ఫైనల్. ఇద్దరిలో ఎవరు గెలిచినా కొత్త చరిత్రే. మరి, గత ఎడిషన్ తుదిపోరులో బోల్తా పడ్డ న్యూజిలాండ్ ఈ కప్పును ఒడిసిపట్టుకుంటుందా? 2011లో ఇండియా, 2015లో ఆస్ట్రేలియా మాదిరిగా హోమ్ టీమ్ ఇంగ్లండే విశ్వ విజేతగా నిలుస్తుందా? కౌన్ బనేగా నయా బాద్‌షా! తేలేది నేడే!
నెలన్నరగా క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్న వరల్డ్ కప్ కథ క్లైమాక్స్‌కు చేరింది. వన్డే క్రికెట్‌లో కొత్త వీరులెవరో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. అంచనాలను అందుకుంటూ, అనూహ్యంగా చెలరేగుతూ, అద్భుత ఆటతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆదివారం జరిగే అల్టిమేట్ వార్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. టోర్నీ మధ్యలో ఇంగ్లిష్ టీమ్, చివర్లో కివీస్ తడబడినా.. సెమీఫైనల్లో రెండు జట్లూ అదిరిపోయే పెర్ఫామెన్స్ చేశాయి. అత్యంత బలమైన టీమిండియాకు విలియమ్సన్‌సేన షాకిస్తే.. డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియాను మోర్గాన్‌సేన మట్టికరిపించింది. దీంతో ఆఖరాటలో హోరాహోరీ తప్పదనిపిస్తోంది. గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన కివీస్ వరుసగా రెండోసారి ఫైనల్‌కు దూసుకొస్తే.. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్ టైటిల్ ఫైట్ చేసేందుకు రెడీ అయింది. టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్లో ఢీకొంటున్న ఈ రెండు జట్ల టార్గెట్ ఒక్కటే. కప్పు నెగ్గి తమ చిరకాల కలను సాకారం చేసుకోవడమే. లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ను 119 రన్స్‌తో ఇంగ్లండ్ చిత్తుగా ఓడించింది. మరి, టైటిల్ ఫైట్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
కివీస్‌కు ఆ ఇద్దరూ.. బౌలర్లు..
ఈ వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ ఆట కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, బౌలర్ల చుట్టూనే తిరుగుతోంది. జట్టు కష్టాల్లో పడ్డప్పుడల్లా బ్యాటుతో కేన్, టేలర్ గట్టెక్కిస్తుంటే.. మొదట బౌలింగ్ చేసినా.. టార్గెట్‌ను కాపాడుకునేప్పుడైనా పేస్ త్రయం ట్రెంట్‌బౌల్ట్, మాట్ హెన్రీ, ఫెర్గూసన్ చెలరేగుతున్నారు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ ఆటను మలుపు తిప్పుతున్నాడు. కివీస్ మాదిరిగా టాపార్డర్ ఇన్నిసార్లు విఫలమైతే మరే జట్టయినా చేతులెత్తేసేదే. కేవలం విలియమ్సన్, టేలర్ పోరాట పటిమతోనే బ్లాక్‌క్యాప్ టీమ్ ముందుకొచ్చింది. టైటిల్ ఫైట్‌లోనూ బ్లాక్‌క్యాప్స్ టీమ్ బ్యాటింగ్‌కు వీరిద్దరే అండ. కానీ, ఈ ఇద్దరిపైనే ఆధారపడితే మాత్రం న్యూజిలాండ్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఫామ్‌లోఉన్న కేన్, రాస్‌ను ఇంగ్లిష్ బౌలర్లు కచ్చితంగా టార్గెట్ చేస్తారు కాబట్టి మిగతా బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గత ఎడిషన్‌లో అద్భుతంగా ఆడిన మార్టిన్ గప్టిల్‌తో పాటు మరో ఓపెనర్ నికోల్స్ ఇప్పుడైనా టీమ్‌కు శుభారంభం ఇవ్వాల్సిందే. మిడిలార్డర్‌లో లాథమ్, ఆల్‌రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్ కూడా సత్తా చాటితే కప్పు కివీస్ సొంతమైనట్టే. సెమీస్‌లో చిన్న టార్గెట్ ఛేజ్ చేయకుండా ఇండియా బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకున్న బౌలర్ల తీరు అభినందనీయం. ఈ మ్యాచ్‌లోనూ ముందుగా ఇంగ్లండ్ టాపార్డర్‌ను దెబ్బకొట్టేందుకు వాళ్లు ప్లాన్స్ రెడీ చేసుకొని ఉంటారు. అయితే, జోష్‌లో ఉన్న రాయ్, బెయిర్ స్టో, రూట్‌ను ఏ మేరకు నిలువరిస్తారనే దానిపైనే విజయావకాశాలు ఉంటాయి. విలియమ్సన్ కెప్టెన్సీ కివీస్‌కు ప్లస్ పాయింట్. ప్రతి క్షణం గేమ్‌లోనే ఉంటూ, పరిస్థితులకు తగ్గట్టు వ్యూహాలు మారుస్తూ టీమ్‌మేట్స్‌లో అతను స్పూర్తి నింపుతున్నాడు. ఆఖరాటలోనూ ఆ పనిని సమర్థంగా నిర్వర్తిస్తే న్యూజిలాండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన నాయకుడిగా కేన్ పేరు చరిత్రలో నిలుస్తుంది.
ఇంగ్లండ్ ఫుల్‌జోష్‌లో
గతంలో ఎప్పుడూ లేని విధంగా దూకుడు మంత్రం జపిస్తున్న ఇంగ్లండ్ వన్డేల్లో పవర్‌ఫుల్‌గా మారిపోయింది. 2015 వరల్డ్‌కప్‌లో దారుణ ఓటమి తర్వాత తన స్టయిల్‌ను పూర్తిగా మార్చుకున్న ఇంగ్లిష్ టీమ్ బ్యాటింగ్‌లో అత్యంత బలంగా తయారైంది. జానీ బెయిర్ స్టో, జేసన్ రాయ్, జో రూట్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్‌లతో వన్డేల్లో ప్రస్తుతం అతి ప్రమాదకర బ్యాటింగ్ విభాగం ఇంగ్లండ్‌దే. ఈ ఫేమస్ ఫైవ్‌కు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బలం అదనం. వీరందరి అండతో ఇంగ్లండ్ లార్ట్స్ లాస్ట్ ఫైట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 1979, 1987, 1992 తుది పోరుల్లో మాదిరిగా కాకుండా ఈసారి కచ్చితంగా కప్పు కైవసం చేసుకోవాలని కోరుకుంటోంది. ఫైనల్ చేరిన గత మూడు పర్యాయాలతో పోలిస్తే ఈసారి మోర్గాన్‌సేన చాలా పటిష్టంగా కనిపిస్తోంది. ఈ టోర్నీలో చెలరేగి ఆడుతున్న ఓపెనర్లు జేసన్ రాయ్ (426 రన్స్), బెయిర్ స్టో (496) ఫైనల్లో హోమ్‌టీమ్‌కు కీలకం కానున్నారు. ఇద్దరి నుంచి జట్టు అదే జోరును ఆశిస్తోంది. వీరిలో ఒక్కరు హిట్టైనా ప్రత్యర్థికి దెబ్బే. మిడిలార్డర్‌లో జో రూట్ (549) నిలకడైన ఆటతో టీమ్‌కు అవసరమైన పని చేసి పెడుతున్నాడు. కెప్టెన్ మోర్గాన్, బెన్ స్టోక్స్ కూడా తలో చేయి వేస్తే జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో పేసర్లు జోఫ్రా ఆర్చర్ (19 వికెట్లు), మార్క్ వుడ్ (17 వికెట్లు), క్రిస్ వోక్స్ (13 వికెట్లు), ప్లంకెట్ (8 వికెట్ల) అద్భుతంగా రాణిస్తున్నారు. దాంతో, పిచ్ ఎలా ఉన్నా కూడా మొదట బౌలింగ్ చేసేందుకు హోమ్‌టీమ్ ఆలోచించే పరిస్థితి లేదు. ఏరికోరి తెచ్చుకున్న బార్బడోస్ ప్లేయర్ ఆర్చర్ అంచనాలను అందుకుంటున్నాడు. కొన్నిసార్లు ఫెయిలైనా.. మార్క్ వుడ్ కూడా పర్‌ఫెక్ట్ బాల్స్‌తో ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. సెమీస్‌లో సత్తా చాటిన స్పిన్నర్ ఆదిల్ రషీద్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంతో బౌలర్ల కాన్ఫిడెన్స్ రెట్టింపైంది. ఇక, ఫీల్డింగ్‌లో కూడా మోర్గాన్‌సేన ఒక మెట్టుపైనే ఉంది. అయితే, అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ.. కొన్నిసార్లు ఒత్తిడికి తలొగ్గడం హోమ్‌టీమ్ బలహీనత. ఆరంభంలోనే వికెట్లు పడితే కోలుకోలేకపోతోంది. ఫైనల్లో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. సొంతగడ్డపై ఆడడం అనుకూలమే అయినా.. భారీ అంచనాలు, ఫేవరెట్ ట్యాగ్ ప్రతికూలమే. అలాగే, చాలా ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన నేపథ్యంలో భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
పిచ్/వాతావరణం
లార్డ్స్‌లో రెండు రోజుల కిందట వరకూ గోల్ఫ్ మైదానాన్ని తలపించేలా వికెట్‌పై పచ్చిక కనిపించింది. శనివారం నాటికి కొంత ఎండినా పిచ్‌పై ఇంకా గ్రాస్ ఉంది. దాంతో, ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపే చాన్సున్నా.. ఎండ వచ్చిన తర్వాత బ్యాట్స్‌మెన్‌కు సహకారం లభించొచ్చు. ఆదివారం వర్ష సూచనలు లేవు. మధ్యాహ్నం సమయంలో ఆకాశం కొంత మేఘావృతం కానుంది. ఒకవేళ వర్షం వచ్చిన రిజర్వ్ డే ఉంది.
మొదట బ్యాటింగ్ చేస్తేనే మొగ్గు
ఈ టోర్నీలో భాగంగా లార్డ్స్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు జట్లు 300 పైచిలుకు స్కోర్లు సాధించాయి. అప్పుడు ఆ జట్లే నెగ్గాయి. అలాగే అన్ని మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. పైగా, నాలుగింటిలో మూడుసార్లు ఛేజింగ్ టీమ్ ఆలౌటైంది. అందువల్ల ఫైనల్లో టాస్ చాలా కీలకం కానుంది. టాస్ నెగ్గిన కెప్టెన్ బ్యాటింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది.
మొదట బ్యాటింగ్ చేస్తేనే మొగ్గు
ఈ టోర్నీలో భాగంగా లార్డ్స్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు జట్లు 300 పైచిలుకు స్కోర్లు సాధించాయి. అప్పుడు ఆ జట్లే నెగ్గాయి. అలాగే అన్ని మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. పైగా, నాలుగింటిలో మూడుసార్లు ఛేజింగ్ టీమ్ ఆలౌటైంది. అందువల్ల ఫైనల్లో టాస్ చాలా కీలకం కానుంది. టాస్ నెగ్గిన కెప్టెన్ బ్యాటింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది.
లార్డ్స్‌లో వరల్డ్‌కప్ ఫైనల్ జరగడం ఇది ఐదోసారి. గత నాలుగు ఫైనల్స్‌లో పర్యాటక టీమ్‌కు కేటాయించే డ్రెస్సింగ్ రూమ్‌ను వాడిన జట్లే విజయం సాధించాయి. ఈసారి ఇంగ్లండ్ హోం డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండనుంది.
జట్లు (అంచనా)
ఇంగ్లండ్: రాయ్, బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్ (కెప్టెన్), బెన్ట్ స్టోక్స్, బట్లర్ (కీపర్), క్రిస్ వోక్స్, ప్లంకెట్, ఆదిల్ రషీద్, ఆర్చర్, మార్క్ వుడ్.
న్యూజిలాండ్: గప్టిల్, నికోల్స్, విలియమ్సన్ (కెప్టెన్), టేలర్, లాథమ్ (కీపర్), నీషమ్, గ్రాండ్‌హోమ్, శాంట్నర్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్, ఫెర్గూసన్.

