దోమలు కుడుతున్నాయా.. మీరేం సబ్బు వాడుతున్నారో చెక్ చేస్కోండి

దోమలు కుడుతున్నాయా.. మీరేం సబ్బు వాడుతున్నారో చెక్ చేస్కోండి

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇళ్లల్లో దోమల బెడద మొదలవుతుంది. వాటిని తరిమికొట్టేందుకు ప్రజలు అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొందరు కాయిల్స్, అగరబత్తులను కాల్చి దోమల నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరేమో శరీరానికి క్రీమ్ రాసుకుని దోమల నివారణకు మార్గాన్ని వెతుకుతుంటారు. అయినా కూడా దోమల బెడద తగ్గకపోతే ఒకసారి మీరు వాడే సబ్బును చెక్ చేసుకోండి. ఈ విషయాన్ని ఊహించి చెప్పట్లేదు. వర్జీనియా పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ అండ్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు ఒక అధ్యయనంలో చేసి మరీ చెబుతున్నారు. కొన్ని సబ్బులు దోమలకు అయస్కాంతాల వలె పనిచేస్తాయని వారు అంటున్నారు.

ఐసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఐదు రకాల విషయాలు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. వీటిలో అమెరికాలో ఉపయోగించే నాలుగు బ్రాండ్ల సబ్బులు దోమలను ఆకర్షిస్తున్నాయి. పండ్లు, నిమ్మ సువాసన గల సబ్బులు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయని ఈ పరిశోధనలో తేలింది. ఎందుకంటే పువ్వుల సువాసనను శరీరంపై పూయడం వల్ల దోమలకు మనుషులు, మొక్కల మధ్య తేడాను గుర్తించడం కష్టమవుతుంది. అందుకే అవి మొక్క మీద వాలినట్టు మనుషుల శరీరంపై వాలుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు కొందరికి కొన్ని సబ్బులను రాసి పరిశోధించారు. వారిలో నిమ్మ లేదా పండ్ల సువాసన వచ్చే సబ్బులు రాసుకున్న వారి చుట్టూ దోమలు ఎక్కువగా గుమికూడుతున్నట్టు వారు గుర్తించారు. అయితే, ఇది అన్ని సబ్బుల విషయంలో కాదు. అమెరికాలో వాడుతున్న కొన్ని సబ్బులతో ఇది జరిగింది. భారతదేశంలోని ప్రజలు కూడా ఈ సబ్బులలో కొన్నింటిని ఉపయోగిస్తారు. శాస్త్రవేత్తల ప్రకారం, దోమలు పువ్వుల సువాసనకు ఆకర్షితులవుతాయి. ఎందుకంటే అవి పీల్చడానికి రక్తం లభించనప్పుడు, అవి పువ్వుల రసాన్ని పీలుస్తాయి. అందుకే వాటికి ఆ సువాసన అంటే ఇష్టం.

ఎలా తరిమికొట్టాలి:

కొబ్బరి సువాసన ద్వారా దోమలను తరిమివేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పరిశోధన రచయిత క్లెమెంట్ వినేజర్ మాట్లాడుతూ.. కొబ్బరి, వెనీలా వాసనను దోమలు ఇష్టపడవు. కాబట్టి అవి దగ్గరకు రావు. వాటితో స్నానం చేస్తే దోమలు కుట్టవని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. ది గార్డియన్ నివేదిక ప్రకారం, కొబ్బరి నూనె సహజ నిరోధకం లాంటిదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకే దోమలు రాకుండా ఉండాలంటే కొబ్బరి నూనెను శరీరానికి రాసుకోండి. కొబ్బరి సబ్బు కూడా ఉపయోగించవచ్చు. లేదా ఆ సువాసన వచ్చే నూనెనైనా ఉపయోగించవచ్చు.