రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది

రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది

టౌన్‌‌ను సిరిసిల్లలా చేస్తనన్న కేటీఆర్‌‌‌‌ ఎక్కడ అని ప్రశ్న

వికారాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, ఎదిరిస్తే హత్యలు చేస్తున్నారని వైఎస్సార్‌‌‌‌టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. మహిళలకు రక్షణ కరువైందని, పట్ట పగలే దోపిడీలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో కలిసి కొడంగల్ టౌన్‌‌ అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. మంగళవారం బండ్ల ఎల్లమ్మ గుడి నుంచి 117వ రోజు పాదయాత్రను ఆమె ప్రారంభించారు. 5 ఏండ్లు సీఎంగా ఉన్న వైఎస్సార్​ ఎన్నో అద్భుత పథకాలను అందించి, పేద ప్రజల గుండెల్లో నిలిచారని గుర్తుచేశారు. మోసపూరిత హామీలిచ్చి సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘‘డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యలే.. రుణమాఫీ చేయ్యలే. దళితులకు మూడు ఎకరాల భూమి ఇయ్యలే. పోడు పట్టాలు, ఉచిత ఎరువులు, 57 ఏండ్లకు పెన్షన్లు ఏవీ రాలేదు”అని విమర్శించారు. వలసల పాలమూరు జిల్లా కోసం జలయజ్ఞం ద్వారా నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్‌‌లకు పునాధులు వేసి, 90 శాతం పనులు వైఎస్సార్ పూర్తి చేస్తే, మిగిలిన 10 శాతం పనులు 8 ఏండ్లలో కూడా కేసీఆర్ పూర్తి చేయలేదన్నారు. ప్రాజెక్ట్‌‌లు పూర్తి చేస్తే పాలమూరు పచ్చగా కళకళలాతుండేదన్నారు. 

కొడంగల్​కు ఇంకో దొంగ..

కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్లని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. రేవంత్‌‌రెడ్డిని ఓడించారని షర్మిల అన్నారు. మొహం చెల్లని ముఖాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అధ్యక్షుడిని చేసిందన్నారు. ఇంట గెలవని రేవంత్ రాష్ట్రంలో గెలుస్తాడా అని ప్రశ్నించారు. కొడంగల్‌‌లో ఒక దొంగ పోయాడు అనుకుంటే.. ఇంకో దొంగ టీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే రూపంలో వచ్చాడని మండిపడ్డారు. ఆయన అక్రమ సంపాదన కోట్లల్లో ఉందని ఆరోపించారు. ‘‘మంత్రి హరీశ్‌‌ రావు వచ్చి బంగారు కొడంగల్ చేస్తా అన్నడు.పక్కనే ఉన్న కోస్గికి బస్ డిపో అని చెప్పి ఇవ్వలే.  కేటీఆర్‌‌‌‌ వచ్చి కొడంగల్‌‌ను దత్తత తీసుకొని సిరిసిల్లలా మారుస్తనని చేయలేదు.  ఎదిరిస్తే ప్రాణాలు తీస్తున్నారు. ఒక్క కొడంగల్‌‌లోనే కాదు.. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. దుర్మార్గపు పాలన తెలంగాణలో సాగుతోంది. కేసీఆర్ సిపాయి మేఘ కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే మూడేండ్లలో మునిగిపోయింది”అని అన్నారు.