సరుకులు కావాలంటే.. వాగులు, గుట్టలు దాటాల్సిందే

సరుకులు కావాలంటే.. వాగులు, గుట్టలు దాటాల్సిందే

గోస పడుతున్న అడవి బిడ్డలు

ఉమ్మడి జిల్లాలో 8 ఏండ్లుగా రేషన్ డీలర్ల నియామకాలు లేవు

ఆసిఫాబాద్, వెలుగు: బియ్యం కోసం కోసుల దూరం నడుస్తూ బండరాళ్లపై పయనిస్తూ ఎండలో ఎండుతూ ,వానలో తడుస్తూ పట్టెడన్నం కోసం అడవి బిడ్డలు పడరాని పాట్లు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో నిరుపేదలు సర్కార్ ఇచ్చే రేషన్ బియ్యం కోసం దట్టమైన అడవిలో గుట్టలు, వాగులు వంకలు దాటి సరుకులు తెచ్చుకుంటున్నారు. వివిధ కారణాలతో ఖాళీ అయిన డీలర్ల స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో అడవి బిడ్డలకు తిప్పలు తప్పడంలేదు.

ఎనిమిదేళ్లుగా..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా129 రేషన్ దుకాణాలకు డీలర్లు లేరు. ఐదు వందల రేషన్ కార్డులకు ఒక దుకాణం ఉండాలి. కానీ సర్కార్​ ఎనిమిదేళ్లుగా డీలర్ల నియామకం చేపట్టలేదు. దీంతో ఖాళీ అయిన డీలర్ల ప్లేస్ లో ఆఫీసర్లు పక్క ఊరి డీలర్​కు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా సరుకులు ఎప్పుడు వచ్చినా ఆదివాసీలు కోసుల దూరం నడుస్తున్నారు. వాగులు వంకలు దాటుతున్నారు.  రోడ్లు ఉన్న గ్రామాలకైతే ప్రైవేట్ వాహనాలు, ఆటోల్లో వెళ్తున్నారు. అసలు కంటే రవాణా చార్జీలే ఎక్కువవతున్నాయి. మరోవైపు వెళ్లిన సమయానికి డీలర్​ లేకపోతే ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు.

గోస పడుతున్నం..

మా గోసను ఎవరూ పట్టించుకుంటలేరు. ఎలక్షన్ అంటేనే లీడర్లు ఊరికొస్తారు. తర్వాత ఇటువైపు చూడరు. నిత్యవసర సరుకులకు తక్లీప్ అయితుంది. గుట్టలు, వాగులు దాటి 9 కిలోమీటర్లు నడుస్తున్నం.-మర్సకోల అశోక్, గుండాల, తిర్యాణి. -మర్సకోల అశోక్, గుం డాల, తిర్యాణి
నివేదిక పంపినం
డీలర్ల నియామకానికి సర్కార్ కు నివేదిక పంపినం. ప్రస్తుతం పక్క ఊరి డీలర్ ను ఇన్చార్జిగా నియమించి సరుకులు అందజేస్తున్నాం. -స్వామి కుమార్, డీఎస్ వో, ఆసిఫాబాద్.

ఉమ్మడి జిల్లా సమాచారం

ఆసిఫాబాద్

కార్డుదారులు            1,37,457

రేషన్ దుకాణాలు             278

డీలర్ల ఖాళీలు                   35

ఆదిలాబాద్

కార్డుదారులు          1,88,670

రేషన్ దుకాణాలు            365

డీలర్ల ఖాళీలు                  35

నిర్మల్

కార్డుదారులు           2,04,414

రేషన్ దుకాణాలు             390

డీలర్ల ఖాళీలు                  32

మంచిర్యాల

కార్డుదారులు          2,14,311

రేషన్ దుకాణాలు             435

డీలర్ల ఖాళీలు                  27