దివాళా అంచున్న ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు IMF మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వేర్వేరు ఆర్థిక సహాయ ఒప్పందాల కింద పాకిస్థాన్‌కు 1.2 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.11వేల 400 కోట్ల నిధులను విడుదల చేసేందుకు ఐఎంఎఫ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తంలో సుమారు 1 బిలియన్ డాలర్లు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద, మిగిలిన 210 మిలియన్ డాలర్లు రెసిలియెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ కింద అందనున్నాయి దాయాదికి. ఈ కొత్త నిధులు వచ్చే వారం ప్రారంభంలో పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంకుకు చేరుతాయని, దీనివల్ల దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు 17 బిలియన్ డాలర్లకు పైగా పెరుగుతాయని అంచనా.
మొత్తం 8.4 బిలియన్ డాలర్ల విలువైన రెండు ప్యాకేజీలకు గాను.. పాకిస్థాన్ ఇప్పటివరకు 4.5 బిలియన్ డాలర్లను రుణంగా పొందింది ఐఎంఎఫ్ నుంచి. 2024 సెప్టెంబర్‌లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. 37 నెలల కాలంలో మొత్తం 7 బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ అందించనుంది. జూలై-డిసెంబర్ 2025 కాలానికి సంబంధించి పాకిస్థాన్ ఆర్థిక పనితీరును సమీక్షించిన తర్వాతే ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పన్ను వసూళ్లలో వెనుకబడి ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. చిల్లర వర్తకుల నుంచి రావాల్సిన ఆదాయపు పన్ను ఐఎంఎఫ్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయింది. ఈ లోటును పూడ్చుకోవడానికి పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోలియం లెవీ ధరలను పెంచాల్సి వచ్చింది. అంతేకాకుండా గ్యాస్ రంగం స్థిరత్వం, సామాజిక మద్దతు, గవర్నెన్స్ వంటి రంగాల్లో ప్రభుత్వం కొన్ని నిర్మాణాత్మక సంస్కరణలను సమయానికి పూర్తి చేసింది. వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా గ్రీన్ టాక్సానమీని అవలంబించడం, వాతావరణ రిస్క్ మేనేజ్‌మెంట్ మార్గదర్శకాలను జారీ చేయడం వంటి కఠిన నిబంధనలను కూడా పాక్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఆర్థిక స్థిరీకరణ కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం, పేదరికం, ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ పాత ఆర్థిక ద్రవ్య లక్ష్యాలకే కట్టుబడి ఉంటామని ప్రభుత్వం ఐఎంఎఫ్‌కు హామీ ఇచ్చింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య యుద్ధం వంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణను వదలబోమని, రాబోయే బడ్జెట్‌ను కూడా ఐఎంఎఫ్ సంప్రదింపులతోనే రూపొందిస్తామని ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ స్పష్టం చేశారు. అధిక ఆర్థిక వృద్ధి కంటే ఆర్థిక స్థిరత్వానికే పెద్దపీట వేస్తూ.. సుస్థిర వృద్ధితో ముందుకెళ్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.
