సినీ కార్మికులకు అండగా నేనున్నా : చిరంజీవి

సినీ కార్మికులకు అండగా నేనున్నా : చిరంజీవి

సినీ కార్మికులకు అండగా నేనున్నా
వారి వయసు తగ్గించుకునేందుకే ఇండస్ట్రీ పెద్ద అంటున్నరు : చిరంజీవి

గండిపేట వెలుగు : ‘‘కొందరు నన్ను ఇండస్ట్రీ పెద్ద అంటున్నారు. వాళ్ల వయసు తగ్గించుకునేందుకు  నన్ను పెద్ద అంటున్నారేమో అని నాకనిపిస్తోంది. సినీ కార్మికులకు అండగా నేనున్నా.. అవసరం వచ్చినప్పుడు కార్మికుల వెంట నేను ఉంటా” అని సినీ నటుడు చిరంజీవి అన్నారు. మణికొండ మున్సిపల్‌‌‌‌ పరిధిలోని చిత్రపురి కాలనీలో సాముహిక గృహ ప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్రపురిలో 1,176 ఎంఐజీ, 180 హెచ్‌‌‌‌ఐజీ డూప్లెక్స్‌‌‌‌ ఫ్లాట్స్‌‌‌‌ ఓనర్స్‌‌‌‌కు చిరంజీవి, మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ ఇంటి తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినీ కార్మికుల సమక్షంలోకి అతిథిగా రావడం సంతోషంగా ఉందన్నారు. మనం తిన్నా తినకున్నా మనకొక ఇల్లు ఉంటే ఆ తృప్తే వేరన్నారు. సినీ కార్మికుల సొంతింటి కలను నిజం చేసిన చిత్రపురి కమిటీకి అభినందనలు తెలిపారు.

స్వర్గీయ ఎం.ప్రభాకర్‌‌‌‌రెడ్డి సొసైటీ కోసం చేసిన కృషి ఎనలేనిదని, ఇప్పుడు ఆయన కల నెరవేరిందన్నారు. దేశంలో మరే సినీ పరిశ్రమలోనూ కార్మికులకు ఇంత పెద్ద గృహసముదాయం లేదన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగానికి, కార్మికులకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. కాలనీలో మంచినీటి సమస్య తలెత్తకుండా మిషన్‌‌‌‌ భగీరథ పైపులైన్‌‌‌‌ వచ్చేలా చేస్తామన్నారు. కార్యక్రమంలో నిర్మాతలు సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌ వల్లభనేని, ఎఫ్‌‌‌‌డీసీ చైర్మన్‌‌‌‌ అనిల్, ఫిలిం చాంబర్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.