చింద్వారా: తమపై పోలీసులకు కంప్లైంట్ చేసిందని వివాహితపై కక్ష పెంచుకున్న అత్తింటివారు స్వీట్లో విషం కలిపి ముగ్గురు మరణానికి కారణమయ్యారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఈ దారుణం జరిగింది. ఖుష్బూ కథూరియా (22) కు 2024 జనవరిలో పెండ్లయింది. అత్తింటివారు వేధించడంతో ఖుష్బూ తన పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది.
పోలీసులకూ ఫిర్యాదు చేయడంతో అత్తింటివారు తమ పరువు పోయిందని భావించారు. దీంతో ఖుష్బూతో పాటు ఆమె కుటుంబాన్ని చంపాలని ప్లాన్ చేశారు. స్వీట్లలో విషం కలిపి వాటిని ఓ బ్యాగ్‌లో పెట్టారు. గత నెల 9న ఆ బ్యాగ్‌ను చింద్వారాలోని జున్నర్ దేవ్ ఏరియాలో ఖుష్బూ తండ్రి షాప్‌కు సమీపంలో వేలాడదీసి వెళ్లిపోయారు. అయితే, ఆ బ్యాగులోని స్వీట్లను తొలుత సెక్యూరిటీ గార్డు యదువంశీ, ఆ తర్వాత ఖుష్బూ కుటుంబ సభ్యులు తిన్నారు. దీంతో యదువంశీతో పాటు ఖుష్బూ, ఆమె తాత చనిపోయారు.
