అహ్మదాబాద్: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో మార్పులు చేస్తారా? గత ఆరు మ్యాచ్‌ల్లో ఘోరంగా నిరాశపర్చిన స్టార్ హిట్టర్ అభిషేక్ శర్మను కొనసాగిస్తారా? పించ్ హిట్టర్‌గా రింకూ సింగ్‌కు చాన్స్ ఏమైనా ఇస్తారా? ఫామ్‌లో లేని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తప్పించి కుల్దీప్‌ను ఆడిస్తారా? మెగా ఫైనల్‌కు ముందు ఫ్యాన్స్ మదిలో మెదులుతున్న ప్రశ్నలివి.
అయితే వీటన్నింటికి ఇప్పటికైతే మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఓపెనింగ్‌లో మార్పులు చేయడం వల్ల ఫలితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా ఉండటంతో ఎలా ముందుకెళ్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
టోర్నీ ప్రారంభంలో శాంసన్‌కు కనీసం చాన్స్ కూడా దక్కలేదు. కానీ వెస్టిండీస్‌తో సూపర్–8 మ్యాచ్ తర్వాత శాంసన్ పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు బ్యాటింగ్‌కు మూలస్తంభంగా మారిపోయాడు. టోర్నీకి ముందు అభిషేక్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. కానీ జింబాబ్వేపై హాఫ్ సెంచరీ మినహాయిస్తే గత ఆరు మ్యాచ్‌ల్లో అతను 0, 0, 0, 15, 10, 9 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో సహజంగానే అభిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
నో ఛేంజ్..
మెగా ఫైనల్‌కు ముందు కాంబినేషన్స్ మారిస్తే జట్టు లయ దెబ్బతింటుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీంతో అభిషేక్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పవర్‌ప్లేలో శాంసన్ ఎక్కువ బాధ్యత తీసుకునే విధంగా స్ట్రాటజీని మార్చొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల అభికి కుదురుకునే టైమ్‌తో పాటు కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవడానికి వీలవుతుంది. ఒక్కసారి కుదురుకుంటే అభి బ్యాట్ నుంచి సిక్సర్ల వర్షం కురవడం ఖాయం. ‘మేం మా ప్లేయర్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. గంభీర్, సూర్య.. అభిషేక్‌పై చాలా నమ్మకంతో ఉన్నారు. ఫైనల్లో అతను కచ్చితంగా ప్రభావం చూపిస్తాడు’ అని శాంసన్ పేర్కొన్నాడు.
కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా అభి గణనీయంగా బరువు తగ్గాడు. ఇది అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపిస్తోంది. ల్యాఫ్టెడ్ స్ట్రోక్స్‌ను ఆడటంలో టైమింగ్ కుదరడం లేదు. దాంతో ఈజీగా క్యాచ్‌లు ఇస్తున్నాడు. ఆఫ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆడకూడని స్ట్రోక్స్‌తో ఇబ్బందిపడుతున్నాడు. స్లో డెలివరీస్‌ను భారీ షాట్‌గా మల్చేందుకు ట్రై చేసి ఫెయిలవుతున్నాడు. అతను కోరుకుంటున్న ఎలివేషన్ రాకపోవడంతో సాంకేతికంగా బ్యాట్ డౌన్ స్వింగ్ వేగం, బ్యాట్ పేస్ తగ్గిపోతోంది. ఫలితంగా బాల్స్‌కు అనుగుణంగా బ్యాట్‌ను సర్దుబాటు చేసుకోలేక అనవసరంగా వికెట్ ఇచ్చుకుంటున్నాడు.
రింకూతో లైనప్కు ఇబ్బంది ?
ఒకవేళ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చి రింకూ సింగ్‌ను తీసుకుంటే లైనప్ మొత్తం రివర్స్ అవుతుంది. ఇది మరో పెద్ద సమస్యగా తయారవుతుంది. ప్రస్తుతం టాప్, మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. మిడిలార్డర్‌లో రింకూను జోడిస్తే 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి వస్తుంది. ఆ టైమ్‌లో అతను ప్రభావం చూపించడానికి పెద్దగా చాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మ్యాచ్ చివరి అంకానికి చేరుతుంది. అదే టైమ్‌లో ఓ బౌలర్‌నూ త్యాగం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది సరైన ఎంపిక కాదని విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికైతే సెమీస్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కాకపోతే బౌలింగ్‌లో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. భారీగా రన్స్ ఇచ్చుకుంటున్న వరుణ్ చక్రవర్తి ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్‌కు చాన్స్ ఇస్తారేమో చూడాలి. లేకపోతే బ్యాటింగ్ డెప్త్ పెంచాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ కూడా రెడీగా ఉన్నాడు. ఓవరాల్‌గా ఒక్క అభిషేక్‌పై దృష్టి పెడితే చాలా సమస్యలు కళ్ల ముందుకు రానున్న నేపథ్యంలో మార్పులకు మేనేజ్‌మెంట్ ఇష్టపడకపోవచ్చు.
ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా శుక్రవారం అహ్మదాబాద్‌కు చేరుకుంది. ముచ్చటగా మూడో టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకోవడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, సౌతాఫ్రికాతో సూపర్–8 మ్యాచ్ టైమ్‌లో బస చేసిన హోటల్‌ను మార్చి వేరేదాంట్లో దిగారు. నల్ల మట్టి పిచ్‌పై సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి నేపథ్యంలో.. ఫైనల్‌కు ఎర్ర మట్టి పిచ్‌ను ఎంచుకోనున్నారు.
వాంఖడేలో ఎర్రమట్టి పిచ్‌పై బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. ఇక్కడ కూడా అది కలిసొస్తుందని భావిస్తున్నారు. ప్యూర్టోరికన్ గ్రామీ అవార్డు గ్రహీత సింగర్ రికీ మార్టిన్ ఆదివారం జరిగే ఫైనల్స్‌కు ముందు నరేంద్ర మోడీ స్టేడియంలో 'దండియా క్వీన్' ఫాల్గుణి పాఠక్, బాలీవుడ్ ప్లేబ్యాక్ గాయకుడు సుఖ్విందర్ సింగ్‌లతో కలిసి ఆడి పాడనున్నాడు. టాస్‌కు ముందు వీనులవిందైన సంగీతంతో అలరించనున్నారు.
ఐకానిక్ చార్ట్‌బస్టర్ ‘అన్ డోస్ ట్రెస్’, మరియా బీట్‌లకు కాలు కదపనున్నారు. ఫైనల్ చూసేందుకు వెళ్లే ఫ్యాన్స్ కోసం వెస్ట్రన్ రైల్వే ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ప్రత్యేక రైల్‌ను నడపనుంది. విమాన ప్రయాణంతో పోలిస్తే చాలా తక్కువ ధరకే టిక్కెట్లను అందుబాటులో ఉండేలా చూస్తున్నారు
