ఇండో-మయన్మార్ బోర్డర్ లో రెబల్స్ ను అణిచేసిన ఆర్మీ

ఇండో-మయన్మార్ బోర్డర్ లో రెబల్స్ ను అణిచేసిన ఆర్మీ

ఇండో–మయన్మార్ బోర్డర్​లో ఇండియన్ ఆర్మీ భారీ ఆపరేషన్ నిర్వహించింది. మే 16 నుంచి జూన్ 8 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో తలనొప్పిగా మారిన మిలిటెంట్ల స్థావరాలను నేలకూల్చింది. ఇటువైపు నుంచి మన ఆర్మీ మిలిటెంట్ల భరతం పడుతుంటే, సరిహద్దుకు ఆవల మయన్మార్ ఆర్మీ అటు వైపు వస్తున్న వారి పని పట్టింది. తప్పించుకుందామని ప్రయత్నించిన 80 మంది మిలిటెంట్లను ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుని, స్థానిక పోలీసులకు అప్పజెప్పింది. ఈ ఆపరేషన్​ను సన్ షైన్–2గా పిలుస్తున్నారు. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న మిలిటెంట్ ఆర్గనైజేషన్లను భారీగా దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఆర్మీ తరఫున స్పెషల్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్, ఘాతక్ ఇన్​ఫాంట్రీ బలగాలు, మయన్మార్ ఆర్మీకి చెందిన నాలుగు బ్రిగేడ్లు ఆపరేషన్​లో పాల్గొన్నాయి. ఈ ఆపరేషన్ ఫిబ్రవరి 22 నుంచి 26 మధ్య జరిగిన ‘ఆపరేషన్ సన్ షైన్–1’కు కొనసాగింపు. అరకన్ రెబల్ గ్రూపు మిలిటెంట్లు ఇండియాలోకి చొరబడ్డాయనే సమాచారంతో ఆర్మీ ఈ ఆపరేషన్ ను లాంచ్ చేసింది. మన బలగాల నుంచి తప్పించుకుని పారిపోతున్న అరకన్లను, మయన్మార్ ఆర్మీ బోర్డర్ వద్ద పట్టుకుంది. రెండు దేశాల ఆర్మీలు మాట్లాడుకుని ఈ ఆపరేషన్ ను లాంచ్ చేశాయని పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసరు ఒకరు వెల్లడించారు.

ఎన్ఎస్సీఎన్–కె, ఎన్డీఎఫ్బీ, యూఎల్ఎఫ్ఏ(ఐ), కెఎల్ఓ, ఎన్ఈఎఫ్టీకి చెందిన ఎనిమిది క్యాంపులను మయన్మార్ ఆర్మీ మోర్టార్ షెల్లింగ్ తో నేలకూల్చింది. ఈ క్యాంపులు ఎక్కువగా ఎన్ఎస్సీఎన్–కె చెందినవని తెలిసింది. తమ ఆపరేషన్ లో ఇద్దరు మిలిటెంట్లు హతమైనట్లు మయన్మార్ ఆర్మీ చెప్పిందని పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసరు ఒకరు చెప్పారు. వర్షాకాలం కావడంతో గ్రూపులు మళ్లీ జట్టు కట్టకుండా, మరో మూడు నెలల పాటు ఇవే ప్రాంతాల్లో మయన్మార్ ఆర్మీ పహారా కాయనుంది.  కాపలా కాసే మయన్మార్ ఆర్మీకి, ఇండియన్ ఆర్మీ లాజిస్టిక్స్ సపోర్టు ఇవ్వనుంది. ఇందులో భాగంగా సగైంగ్ రీజియన్​లో కాపలా కాసే సోల్జర్స్​కు స్పెషల్ రేషన్, ఫుడ్ పంపుతారు. ఆపరేషన్ సన్ షైన్ –2 లో రెండు దేశాల ఆర్మీలు బోర్డర్ దాటకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాయి. హెడ్ క్వార్టర్స్ తో సమన్వయపరుచుకుంటూ ఆపరేషన్ నిర్వహించాయి. శాటిలైట్ ఫొటోలు, తురాయా టెలిఫోన్స్, హెలికాప్టర్లతో ముందుగా గూఢచర్యంతో దాడి చేసే ప్రదేశాలను ఆర్మీలు ఎంచుకున్నాయి. వాటికి అనుగుణంగానే ఆపరేషన్ ను విజయవంతం చేశాయి. జాయింట్ మిలటరీ ఆపరేషన్ ను ఎన్ఎస్సీఎన్(కె) రెబల్స్ గ్రూపు తిప్పికొట్టాలని చూసింది. వాళ్ల ఎదురుదాడిలో అస్సాం రైఫిల్స్ కు చెందిన ఇద్దరు సైనికులు అమరులయ్యారు. బోర్డర్ లోని రోడ్డుపై వెళ్తున్న ఆర్మీ వాహనంపై రెబల్స్ దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు సైనికులకు గాయాలయ్యాయి.