పెట్రోల్ పంప్ పై కుప్పకూలిన హోర్డింగ్.. 35 మందికి గాయాలు

పెట్రోల్ పంప్ పై కుప్పకూలిన హోర్డింగ్.. 35 మందికి గాయాలు

మహారాష్ట్ర: ముంబయిలోని ఘాట్‌కోపర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి రోడ్డు ప్రక్కన ఉన్న ఓ పెద్ద హోర్డింగ్, పోలీస్ గ్రౌండ్ పెట్రోల్ పంప్ పై కుప్పకూలింది.  ఈ ప్రమాదంలో దాదాపు 35 మంది గాయపడినట్లు తెలుస్తోంది.  ఘట్‌కోపర్ లోని పంత్‌నగర్ లో ఛేడా నగర్ జింఖానా సమీపంలో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు.ఈ ఘటనలో గాయపడిన 35 మందిని చికిత్స కోసం వెంటనే  రాజావాడి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. హోర్డింగ్ కింద చిక్కుకున్న దాదాపు 100మందిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కమిషనర్ భూషణ్ గగ్రానీ మాట్లాడుతూ.. NDRF (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొందని, రెస్క్యూ ప్రయత్నాల కోసం క్రేన్లు, (గ్యాస్) కట్టర్లతో హోర్డింగ్ ను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు.

ముంబై, పొరుగు ప్రాంతాలైన థానే, పాల్ఘర్‌లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.. వచ్చే 3-4 గంటల్లో పాల్ఘర్, థానే జిల్లాల్లోని పలు ప్రదేశాలలో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలుల వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది.