- కీలక టెక్నాలజీని పరీక్షించిన ప్రైవేట్ కంపెనీ
- కక్ష్యలో ఐఎస్ఎస్ ను విజయవంతంగా ఫొటోలు తీసిన శాటిలైట్
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనల్లో ఓ ప్రైవేట్ కంపెనీ కీలక మైలురాయిని సాధించింది. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాలను, వస్తువులను ట్రాక్ చేసే స్వదేశీ టెక్నాలజీని అజిస్టా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ విజయవంతంగా పరీక్షించింది. రీసెర్చ్ లో భాగంగా 80 కిలోల భూపరిశీలన ఉపగ్రహం ‘ఏఎఫ్ఆర్’ను ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ కంపెనీ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. రెండున్నరేండ్లు సేవలు అందించనున్న ఏఎఫ్ఆర్ శాటిలైట్ పనితీరు వంద శాతం సంతృప్తికరంగా ఉందని ఆ కంపెనీ వెల్లడించింది. తాము ఏఎఫ్ఆర్ తో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)ను విజయవంతంగా ట్రాక్ చేశామని ప్రకటించింది. ఈ నెల 3న రెండు విడతలుగా 300 కిలోమీటర్ల దూరం నుంచి ఓసారి, 245 కిలోమీటర్ల దూరం నుంచి మరోసారి ప్రయోగం చేపట్టామని తెలిపింది.
ఈ రెండు సందర్భాల్లోనూ వేగంగా దూసుకెళ్లే ఐఎస్ఎస్ ను తమ ఉపగ్రహం కచ్చితత్వంతో ఫొటోలు తీసి పంపిందని, దీంతో కక్ష్యలో తిరుగుతున్న ఏ ఉపగ్రహాన్ని లేదా వస్తువునైనా ట్రాక్ చేయగల సత్తాను తాము చాటామని పేర్కొంది. ఏఎఫ్ఆర్ లోని సెన్సర్లు, ట్రాకింగ్ ఆల్గారిథమ్, ఎలక్ట్రోఆప్టికల్ ఇమేజింగ్ పరికరాలు వందకు వంద శాతం కచ్చితత్వంతో పనిచేశాయని ప్రకటించింది. కాగా, కమ్యూనికేషన్, నావిగేషన్, భూపరిశీలన, వ్యూహాత్మక అవసరాల కోసం ఇండియా ప్రస్తుతం దాదాపు 50 ఉపగ్రహాలను నిర్వహిస్తోంది. కక్ష్యలో వీటిని రక్షించుకోవడంతోపాటు మన శత్రు దేశాల శాటిలైట్లపై నిఘా పెట్టేందుకూ ఈ టెక్నాలజీ ఎంతో అవసరమని చెప్తున్నారు. ఈ నిఘా సామర్థ్యాలపై ఇస్రో ఇప్పటికే ఫోకస్ పెట్టినప్పటికీ, ప్రైవేట్ కంపెనీల పరిశోధనలతో టెక్నాలజీని మరింత సమర్థంగా రూపొందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
