సియోల్: డేవిస్ కప్ ఫైనల్–8కు చేరిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించాలనుకున్న ఇండియా ఆశలు నెరవేరలేదు. శుక్రవారం ముగిసిన క్వాలిఫయర్ రౌండ్–2 మ్యాచ్‌లో ఇండియా 1–3తో కొరియా చేతిలో కంగుతిన్నది. 0–2తో ఆట మొదలుపెట్టిన ఇండియాకు డబుల్స్ ప్లేయర్లు దక్షిణేశ్వర్ సురేశ్–ఎన్. శ్రీరామ్ బాలాజీ కీలక విజయాన్ని అందించాడు. 6–3, 3–6, 6–3తో జిసుంగ్ నామ్–ఉసుంగ్ పార్క్ పై గెలిచారు.
దాంతో ఇండియా 1–2 స్కోరుతో నిలిచింది. అయితే కీలకమైన రివర్స్ సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 1–6, 2–6తో కొరియా నంబర్‌వన్ ప్లేయర్ సూన్ వూ క్యాన్ చేతిలో ఓడటంతో ఇండియా ఆశలు గల్లంతయ్యాయి. గంటా 8 నిమిషాల మ్యాచ్‌లో నగాల్ సర్వీస్‌ల్లో తడబడ్డాడు. దాంతో కొరియా ప్లేయర్ బలమైన సర్వీస్‌లు, బేస్‌లైన్ ఆటతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. ఈ విజయంతో కొత్త ఫార్మాట్లో డేవిస్ కప్ నాకౌట్‌కు చేరిన తొలి ఆసియా జట్టుగా కొరియా చరిత్ర సృష్టించింది.
