కల చెదిరే..ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్లో భారత్ ఓటమి

కల చెదిరే..ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్లో భారత్ ఓటమి

ఉమెన్స్ హకీ వరల్డ్ కప్  నుంచి భారత జట్టు నిష్క్రమించింది. క్వార్టర్ ఫైనల్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయింది. కీలకమైన మ్యాచ్లో స్పెయిన్ చేతిలో 0-1తో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది.  టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో  నాలుగో స్థానం చేరిన  భారత మహిళ జట్టు.. హాకీ వరల్డ్ కప్లో సత్తా చాటుతుందని అభిమానులు భావించారు. కానీ  లీగ్ దశకే పరిమితమైన నిరాశపర్చింది. 

 ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఫస్ట్ హాఫ్లో స్పెయిన్ డిఫెన్స్ను అద్భుతంగా అడ్డుకున్న భారత జట్టు..ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అటు స్పెయిన్ కూడా తొలి అర్థభాగంలో గోల్ కొట్టలేదు. అయితే సెకండాఫ్లో మరి కొద్ది సమయంలో మ్యాచ్ ముగుస్తుందనగా  స్పెయిన్ ప్లేయర్ మార్టా సెగు... క్లారా కార్ట్ ఇచ్చిన బాల్ను నేరుగా గోల్ పోస్ట్ లోకి పంపింది. ఆ తర్వాత భారత్ గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినా..సఫలం కాలేదు. టీమిండియా గోల్ ప్రయత్నాలను స్పెయిన్ డిఫెండర్లు అద్భుతంగా అడ్డుకున్నారు. దీంతో 1-0తో స్పెయిన్ క్వార్టర్లో అడుగుపెట్టింది. 

వరల్డ్ కప్లో ఓటమిపాలవడంతో.. టీమిండియా .. 9-16  స్థానాల కోసం కెనడాతో మ్యాచ్ ఆడనుంది.   ఈ మ్యాచ్ జులై 12 న జరగనుంది.  ఈ ప్రపంచ కప్ లో   న్యూజిలాండ్, బెల్జియం, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్,  స్పెయిన్, అర్జెంటీనా, ఇంగ్లండ్ టీమ్స్ క్వార్టర్స్కు చేరుకున్నాయి.  మంగళవారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక  జులై 16, 17 న సెమీస్.. 18న ఫైనల్ జరగనుంది.