మరో రోహిత్ వేముల అయితనన్న భయంతోనే.. ఊరెళ్లి వ్యవసాయం చేస్కుంటున్న! : వేల్పుల సుంకన్న

మరో రోహిత్ వేముల అయితనన్న భయంతోనే.. ఊరెళ్లి వ్యవసాయం చేస్కుంటున్న! :  వేల్పుల సుంకన్న

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో రోహిత్ వేములతో పాటు మరో నలుగురిపై అప్పటి యూనివర్సిటీ వీసీ సస్పెన్షన్ వేటు వేశారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోగా ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే మిగతా నలుగురు స్టూడెంట్లను అప్పటి ఇష్యూలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నలుగురిలో ఒకరైన వేల్పుల సుంకన్న ఇంకా కేసులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నానని చెబుతున్నారు. ఆ ఇష్యూల వల్ల యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూలకు కూడా పిలవలేదని, చేసేదేం లేక చివరకు వ్యవసాయం చేసుకుంటున్నానని అంటున్నారు. ఆయనతో ‘వీ6 వెలుగు’ ప్రతినిధి చేసిన ఇంటర్వ్యూ ఇది.. 

మీ ఐదుగురిని ఎందుకు సస్పెండ్ చేశారు?

బీజేపీ ప్రభుత్వానికి, హిందూత్వ, ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు వ్యతిరేకంగా స్టూడెంట్ ఉద్యమాలు కొనసాగించాం. అందుకే మేం అకడమిక్స్​లో ఉంటే వారి రాజకీయాలు చెల్లవు కాబట్టి మొదటగా హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీలో సస్పెండ్ చేశారు. యూనివర్సిటీలో మేం ఉండటం వల్లే 2016కు ముందు పదేండ్లపాటు బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఒక్కసారి కూడా స్టూడెంట్ ఎలక్షన్స్​లో గెలవలేదు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన 3 నెలలకు జరిగిన ఎలక్షన్స్ లో కూడా మేమే గెలిచాం. బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీ ఓడిపోయింది. మేం ఐదుగురం వర్సిటీలో ఉంటే గెలవలేమనే.. బీజేపీ నేతలు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, రామచందర్ రావు, ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్ కలిసి మా మీద కుట్రపన్నారు. అప్పుడున్న వైస్ చాన్స్​లర్​తో చేతులు కలిపి మమ్మల్ని వర్సిటీ నుంచి బయటకు పంపించారు.  ఈ ఎనిమిదేండ్లలో ఎన్ని కేసులయ్యాయి? ఏయే కేసులు ఇంకా నడుస్తున్నాయి?

బీజేపీ, ఏబీవీపీ వాళ్లు కలిసి పెట్టిన కేసులు చాలా ఉన్నాయి. ఏబీవీపీ లీడర్ సుశీల్ కుమార్​ను కొట్టామనే కేసు, వైస్ చాన్సలర్ మీద దాడి చేశామని, వీసీ బంగ్లా కూల్చేశామని, అంబులెన్స్​పై దాడి చేశామని ఇలా చాలా తప్పుడు కేసులు పెట్టారు. ఈ కేసులు ఇంకా నడుస్తున్నాయి. వాళ్లు పెట్టిన కేసులకు మేము ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ, మేం పెట్టిన కేసుల్లో ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. ఒకే ఒక్క కేసులో ఎఫ్​ఐఆర్ అయింది. దాని చార్జీషీట్ కూడా 8 ఏండ్ల నుంచి పెండింగ్​లో పెట్టారు. 

రోహిత్ కులాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారు? 

రోహిత్ చనిపోయినప్పుడు మేం ఎస్సీ, ఎస్టీ కేసు వేశాం. దీనినుంచి బయటపడడానికే రోహిత్ కులాన్ని వివాదం చేస్తున్నారు. రోహిత్ దళితుడు కాదంటే కేసు నీరుగారిపోతుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన రాజకీయ నాయకులు ఎస్కేప్ కావచ్చని వారి ప్లాన్. 2016లో మమ్మల్ని సస్పెండ్​ చేసినప్పుడే ఈ ఐదుగురు మాల కులానికి చెందినవారని వర్సిటీ రిపోర్టులోనే మెన్షన్ చేశారు. సస్పెన్షన్ ఎత్తేయాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో  పోరాటం చేస్తున్న క్రమంలో రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. తదనంతర పరిణామాలతో న్యాయం జరగదని భావించి, కారకులపై కేసు పెట్టాం. హెచ్​సీయూలో ఐదుగురు దళిత విద్యార్థులను వర్సిటీ నుంచి బహిష్కరించకపోతే తమకు భవిష్యత్ ఉండదని కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, రామచందర్ రావు సంతకం చేసి అప్పుడు ఎమ్​హెచ్ఆర్డీ మినిస్టర్ అయిన స్మృతి ఇరానీకి లెటర్స్ పంపించారు. ఈ దళిత విద్యార్థులు సంఘ విద్రోహ శక్తులని స్మృతి ఇరానీ వీసీకి ఐదు లెటర్లు పంపారు. ఆ లెటర్స్ వల్లే వీసీ మమ్మల్ని సస్పెండ్ చేశారు. 

పోలీసులు హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టు.. ?

మా ఐదుగురి క్యాస్ట్ డిక్లేర్ చేయడానికి పోలీసులు ఎవరు? పోలీసుల డ్యూటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు అందించడం. కానీ రోహిత్ ఎస్సీ కాదని తేలితే ఆయన సర్టిఫికెట్లు రద్దవుతయి కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు సొంత కవిత్వం రాసి హైకోర్టుకు అందించారు. పోలీసులపైనా చర్యలు తీసుకునే టైమొస్తది. అసలు పోలీసులు ఎవరు రోహిత్ ఎస్సీ కాదని డిక్లేర్ చేయడానికి? ఒకవేళ చేస్తే ఎమ్మార్వో లేదా కలెక్టర్ చేయాలి. ఏపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీతో కుమ్మక్కై 8 ఏండ్లుగా రోహిత్ వేములకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా తొక్కిపెట్టింది. గవర్నమెంటే రోహిత్ క్యాస్ట్​ను ఇంకా డిక్లేర్ చేయలేదు. అలాంటప్పుడు రోహిత్ క్యాస్ట్ గురించి పోలీసులు ఎలా మాట్లాడుతారు? 

ఇప్పటికైనా న్యాయం జరుగుతుందా..? 

ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోబోతుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... నిందితులైన స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, రామచందర్ రావు, సుశీల్​ కుమార్ వీళ్లందరూ జైలుకు పోవాల్సి వస్తది. అందుకే పథకం ప్రకారం ఎలక్షన్స్​కు ముందే దొడ్డిదారిన పోలీసులను ప్రలోభపెట్టి హైకోర్టులో తప్పుడు రిపోర్టును సమర్పించి కేసును మూసేసే విధంగా బీజేపీ కుట్రలు పన్నుతోంది. న్యాయం జరిగేవరకు పోరాడతం.

రోహిత్ క్యాస్ట్ వివాదాన్ని సాగదీత..

రోహిత్ మరణం తరువాత 2017లో గుంటూరు జిల్లా కలెక్టర్ రోహిత్ వేముల ఎస్సీ మాల కులానికి చెందిన వాడని సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ బీజేపీ నాయకులను కాపాడడానికి నరేంద్ర మోదీ, అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఉన్న రాజకీయ సాన్నిహిత్యం వల్ల 24 గంటల్లో  ఆ సర్టిఫికెట్ రద్దు చేయించారు. ఆ తరువాత కలెక్టర్ మీడియా ముందుకు వచ్చి దీనిపై తదుపరి విచారణ జరుపుతామని, ఆ తరువాతే రోహిత్ కులం వెల్లడిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి ఎనిమిదేండ్లు అవుతోంది. రోహిత్ వేముల కులాన్ని మాత్రం ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. 

పీహెచ్ డీ పూర్తి చేశారు కదా.. వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు? 

2016లో రోహిత్​ మరణం తరువాత ఏడు నెలలకు నా పీహెచ్​డీ పూర్తయింది. దాని తరువాత ఉద్యమంలో పాల్గొంటూనే ఐఐటీ బాంబేలో మూడేండ్లు రీసెర్చ్ చేశాను. అదే సమయంలో 20 యూనివర్సీటలకుపైనే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కోసం అప్లై చేస్తే ఒక్క యూనివర్సిటీ కూడా నన్ను ఇంటర్యూకు పిలవలేదు. కనీసం ఇంటర్యూకు పిలిచి పర్ఫామెన్స్ బాలేదు అని చెబితే.. ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యేవాడిని. నేను ఎంఏ, బీఈడీ, ఎంఫిల్, పీహెచ్​డీ, ఐఐటీ బాంబే నుంచి పీడీఎఫ్, హెచ్​సీయూ నుంచి ఎంఏ ఫిలాసఫీ, ఎంఫిల్ ఫిలాసఫీ, పీహెచ్​డీ ఫిలాసఫీ చేశా. ఒక ఫ్రొఫెసర్​కు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉండి కూడా మూడేండ్లు వేచి చూశాను. 2019లో మోదీ రెండోసారి అధికారంలోకి రావడంతో నా ఆశలు గల్లంతయ్యాయి. మరో రోహిత్ వేముల అవుతానేమోననే భయంతో.. గత్యంతరం లేని పరిస్థితిలో యూనివర్సిటీలు, అకడమిక్స్ అన్నీ వదిలేసి ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్న.