నమన్ ఓజా సెంచరీ..లంకపై ‘ఇండియా లెజెండ్స్’ విక్టరీ

నమన్ ఓజా సెంచరీ..లంకపై ‘ఇండియా లెజెండ్స్’ విక్టరీ

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ‘ఇండియా లెజెండ్స్’ విజేతగా నిలిచింది. సచిన్ కెప్టెన్సీలోని ఇండియా లెజెండ్స్ టీమ్..ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్ను 33 పరుగుల తేడాతో మట్టికరిపించి.. వరుసగా రెండో సారి రోడ్ సెఫ్టీ వరల్డ్ సిరీస్ టైటిల్ను దక్కించుకుంది. 

ఓజా సెంచరీ..

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన  ఇండియా లెజెండ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఫస్ట్ బాల్కే ఔటయ్యాడు.  లంక మాజీ ఫాస్ట్ బౌలర్ నువాన్ కులశేఖర బౌలింగ్లో  డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సురేశ్ రైనా పెవిలియన్ కు చేరాడు. దీంతో ఇండియా లెజెండ్స్.. 3 ఓవర్లకే 19 పరుగులు చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నమన్ ఓజా, వినయ్ కుమార్ లు జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా నమన్ ఓజా సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 71 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వినయ్ కుమార్ 21 బంతుల్లో 34 పరుగులు చేశాడు. వీరిద్దరు  90 పరుగుల పార్ట్నర్ షిప్ ను నమోదు చేశారు. ఇక చివర్లో వచ్చిన యువరాజ్ సింగ్ 19 పరుగులు, ఇర్ఫాన్ పఠాన్ 11 పరుగులతో  పర్వాలేదనిపించేలా ఆడడంతో భారత్ భారీ స్కోరుకు చేరుకుంది. 

భయపెట్టిన జయరత్నే

ఆ తర్వాత 196 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన  శ్రీలంక 18.5 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఇషాన్ జయరత్నే 22 బంతుల్లో 51పరుగులు మాత్రమే చేశాడు. మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 3 వికెట్లు, అభిమన్యు మిథున్ 2 వికెట్లు దక్కించుకున్నారు. స్టువర్ట్ బిన్నీ, రాజేశ్ పవర్, రాహుల్ శర్మ, యూసుఫ్ పఠాన్ తలా ఓ వికెట్ తీశారు. సెంచరీతో ఆకట్టుకున్న నమన్ ఓజాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.  ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’గా దిల్షాన్ నిలిచాడు.