పెరుగుతున్న బంగారం దిగుమతులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పసిడిపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. దీంతో.. బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక్క గ్రాముపై 13 వందల 91 రూపాయలు పెరిగింది. 10 గ్రాములపై 13 వేల 910 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా గ్రాముపై 12 వందల 75 రూపాయలు పెరిగింది. 10 గ్రాములపై 12 వేల 750 రూపాయలు పెరిగింది.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేందుకు వినియోగదారులు గోల్డ్ షాపులకు, షూరూంలకు భారీగా వెళుతున్నారు. కానీ.. ఈ పెరిగిన ధరలు వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే బంగారం ధర దాదాపు 14 వేలు పెరగడంతో కొనుగోలుదారులు విస్తుపోయిన పరిస్థితి.
భారత ప్రభుత్వం బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ప్లాటినం దిగుమతులపై 6.4 శాతం నుండి 15.4 శాతానికి భారీగా పెంచింది. ఈ పెరిగిన సుంకాలు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో.. దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.
బంగారం, వెండి దిగుమతులపై ప్రభుత్వం 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకంతో పాటు 5% వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (AIDC)ను విధించింది. దీంతో మొత్తం దిగుమతి పన్ను 15 శాతానికి చేరింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అనవసరమైన దిగుమతులను నియంత్రించడమే లక్ష్యంగా బంగారం, వెండి, ప్లాటినంతో సహా విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
