108 దేశాలకు 85 మిలియన్ల​ క్లోరోక్విన్​ ట్యాబ్లెట్స్

108 దేశాలకు 85 మిలియన్ల​ క్లోరోక్విన్​ ట్యాబ్లెట్స్
  • 500 మిలియన్ల పారాసిటమాల్​ ట్యాబ్లెట్లు కూడా
  • కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియా చేయూత
  • మన దేశ అవసరాలు పోను మిగతా స్టాక్ ఎగుమతి
  • ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తరలింపు

న్యూఢిల్లీ: కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో వందకుపైగా దేశాలతో ఇండియా మెడికల్​ దౌత్యం నడుపుతోంది. కరోనా ట్రీట్​మెంట్​లో కీలకంగా మారిన హైడ్రాక్సిక్లోరోక్విన్​ మెడిసిన్​ను రెండు వారాల నుంచి భారీగా ఇతర దేశాలకు పంపుతోంది. ఇప్పటి వరకూ 85 మిలియన్ల క్లోరోక్విన్​ ట్యాబ్లెట్లను, 500 మిలియన్ల పారిసిటమాల్​ ట్యాబ్లెట్లను 108 దేశాలకు పంపినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపాయి. దీనికి అదనంగా ట్యాబ్లెట్ల తయారీలో ఉపయోగించే పారాసిటమాల్ గ్రాన్యూల్స్​ను వెయ్యి టన్నుల వరకూ ఎక్స్​పోర్ట్​ చేసిందన్నారు. ఇప్పటి వరకూ 60 దేశాలకు సంబంధించి 4 వేలకుపైగా ఆర్డర్లు వచ్చాయని, అవన్నీ డిస్పాచ్​కు రెడీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఆర్డర్లు డెలివరీ అయ్యాయన్నారు.

ఫ్లైట్లను నిలిపేయడంతో కష్టాలు
అన్ని దేశాలు ఫ్లైట్​ సర్వీసులను నిలిపేయడంతో ఇతర దేశాలకు క్లోరోక్విన్​ ను ఎగుమతి చేయడం చాలా పెద్ద పనిగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​కు చెందిన స్పెషల్​ ఫ్లైట్లలో ఈ మందులు, ఇతర వస్తువులను పంపతున్నామని తెలిపారు. ప్రస్తుతం యునైటెడ్​ నేషన్స్​ సెక్యూరిటీ కౌన్సిల్​ ప్రెసిడెంట్​గా ఉన్న డొమినిక్​ రిపబ్లిక్​ కు మన క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు పంపాలంటే యూఎస్​ ఎవాక్యుయేషన్​ ఫ్లైట్​లో అట్లాంటాకు.. అక్కడి నుంచి న్యూయార్క్​కు.. చివరగా డొమినిక్​ రిపబ్లిక్​కు గురువారం చేరిందని చెప్పారు. ఇక మారిషస్, సీషెల్స్​కు ఇండియా క్లోరోక్విన్​ ట్యాబ్లెట్లను ఇండియా గిఫ్ట్​గా పంపిందని, ఐఏఎఫ్​ ప్లేన్లలో ఇవి బుధవారం వెళ్లాయని అన్నారు. ఇక ఆఫ్ఘానిస్థాన్​కు పంపాలంటే ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు.

గ్రాంట్​గా మిత్ర దేశాలకు
5 మిలియన్ల క్లోరిక్విన్​ ట్యాబ్లెట్లను, భారీ మొత్తంలో పారాసిటమాల్​ ట్యాబ్లెట్లను 31 దేశాలకు కరోనా వ్యతిరేక పోరాటంలో భాగంగా గ్రాంట్​గా సప్లై చేస్తోందని సౌత్​ బ్లాక్ వర్గాలు తెలిపాయి. వైరస్​ వల్ల తీవ్రంగా ప్రభావం పడిన మన మిత్ర దేశాలకు ముందుగా వీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించాయి. ఇతర దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను సైతం త్వరగా క్లియర్​ చేసేందుకు చూస్తున్నామని, ఇది ఒకట్రెండు రోజుల్లో పూర్తవుతుందని తెలిపాయి.

మన అవసరాలకు సరిపడా స్టాక్
ప్రస్తుతం స్పెషల్​ ఎకనామిక్​ జోన్లలో ఉన్న లేదా ఎక్స్​పోర్ట్స్​ కోసం కేటాయించిన వంద శాతం డ్రగ్స్ ను ఇతర దేశాలకు సప్లై చేయాలని ఇండియా నిర్ణయించింది. తీవ్రమైన పరిణామాలు ఎదురైనా డొమెస్టిక్ అవసరాలకు సరిపడా డ్రగ్స్​ను ఉంచుకుని మిగతా వాటిని ఎగుమతి చేయాలని భావిస్తోంది. కమర్షియల్​ కాంట్రాక్టుల్లో భాగంగా ఇప్పటికే ఇండియా అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్​ సహా 24 దేశాలకు 80 మిలియన్ల క్లోరోక్విన్​ ట్యాబ్లెట్లను ఇప్పటికే సప్లై చేసింది. ఇటలీ, స్వీడన్, సింగపూర్​ సహా 52 దేశాలకు పెద్ద మొత్తం పారాసిటమాల్​ ట్యాబ్లెట్లను ఎగుమతి చేసింది. కొన్ని దేశాలకు రెండు ట్యాబ్లెట్లనూ పంపింది.