- ఆ దేశం 'లా లా ల్యాండ్'లో బతుకుతోంది
- యూఎన్‌లో పాకిస్తాన్‌పై భారత్ నిప్పులు
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (యూఎన్) వేదికగా పాకిస్తాన్‌పై భారత్ మరోసారి విరుచుకుపడింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ భారత ప్రతినిధి అనుపమ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ వాస్తవాలను చూడకుండా ఏదో ఊహల్లో (లా లా ల్యాండ్‌లో) బతుకుతోందని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి అడుక్కుంటున్న అప్పు కంటే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి బడ్జెట్ రెట్టింపని తెలిపారు.
ఈ నెల 23 నుంచి జెనీవాలో ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) 61వ సమావేశంలో గురువారం పాకిస్తాన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జమ్మూ కాశ్మీర్‌పై ఆరోపణలు చేశాయి. దీనికి 'రైట్ టు రిప్లై' వినియోగించుకుని అనుపమ సింగ్ కౌంటర్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. 1947లో జరిగిన విలీనం చట్టబద్ధమైనదని, దాన్ని ఎవరూ మార్చలేరని తేల్చి చెప్పారు.
అసలు వివాదం ఏదైనా ఉంటే.. అది పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగాల (పీవోకే) గురించేనని, వెంటనే ఆ ప్రాంతాలను పాక్ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. కాశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తయిన 'చీనాబ్ రైల్వే వంతెన' వంటి కట్టడాలు అక్కడి అభివృద్ధికి నిదర్శనమన్నారు. సొంత దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలే పూర్తి కాలం అధికారంలో ఉండని పాకిస్తాన్.. భారత ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ కాశ్మీర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని, కానీ అక్కడి ప్రజలు ఓటు ద్వారా హింసను తిరస్కరించి అభివృద్ధిని కోరుకుంటున్నారని వివరించారు. పక్క దేశాలపై ఏడవడం మానేసి, పాక్ సొంత దేశాన్ని సరిదిద్దుకుంటే మంచిదని హితవు పలికారు.
