- త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్న కేంద్ర మంత్రి గోయల్
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ పై వచ్చే నెల రెండో వారంలోపు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇండియాపై అమెరికా తగ్గించిన 18 శాతం సుంకాలతో పాటు రూ.45 లక్షల కోట్ల విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు కుదిరిన ఒప్పందంపైనా ఇరు దేశాల అధినేతలు సంతకాలు చేస్తారని గోయల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంపై ఐదు రోజుల్లో ఒక జాయింట్ స్టేట్ మెంట్ ను విడుదల చేస్తామన్నారు. అలాగే, డీల్ కు సంబంధించి ప్రతిపక్షాలు లేవనెత్తిన సందేహాలు, అంశాలపైనా క్లారిటీ ఇస్తామని చెప్పారు.
ఇక రైతుల ప్రయోజనాలు రక్షించడానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని స్పష్టం చేశారు. డెయిరీ, ఫిషరీస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు వీలు కల్పించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆ రంగాల మార్కెట్ లో అమెరికా స్థానం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాను అనుమతించాలన్న విషయంలో చర్చలు జరగలేదని తెలిపారు. యూఎస్ కు ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో రెసిప్రోకల్ టారిఫ్ లు తక్కువ ఉన్న దేశం ఇండియా ఒక్కటే అని గోయల్ చెప్పారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ సెక్టార్లకూ ఈ డీల్ తో లబ్ధి చేకూరుతుందని ఆయన వెల్లడించారు.
