నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఇండియా ఐదో టెస్టు

నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఇండియా ఐదో టెస్టు
  • ఏం చేస్తరో..నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఇండియా ఐదో టెస్టు
  • బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి
  • రోహిత్, రాహుల్​ గైర్హాజరీలో 
  •  టీమిండియాపై ఒత్తిడి
  • ఫుల్ జోష్‌‌‌‌లో హోమ్‌‌ టీమ్‌‌
  • మ. 3 నుంచి సోనీ నెట్‌‌వర్క్‌‌లో


బర్మింగ్‌‌‌‌హామ్‌‌:   కొత్త కెప్టెన్లు, కొత్త కోచ్​లు. కొత్త సవాళ్ల నడుమ ఇండియా,  ఇంగ్లండ్‌‌  జట్లు  గతేడాది ఐదు టెస్టుల సిరీస్‌‌లో వాయిదా పడ్డ ఐదో టెస్టు, ఆఖరి టెస్టుకు రెడీ అయ్యాయి. శుక్రవారం మొదలయ్యే ఈ టెస్టులో నెగ్గి లేదా డ్రా చేసుకొని సిరీస్‌‌ చేజిక్కించుకోవాలని ఇండియా భావిస్తుండగా... 2–2తో సిరీస్‌‌ పంచుకోవాలని ఆతిథ్య జట్టు కృత నిశ్చయంతో ఉంది.  తొమ్మిది నెలల కిందట ఆడిన నాలుగు టెస్టుల తర్వాత ఇండియా 2–1తో ఆధిక్యంలో నిలిచింది. నాడు ఇండియా జట్టులో పలువురు కరోనా బారిన పడటంతో ఆఖరి టెస్టును ఇప్పటికి రీషెడ్యూల్‌‌ చేశారు. ఈ కాలంలో ఇరు జట్లలోనూ అనేక మార్పులు జరిగాయి. రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్​ ఇండియా కోచ్​గా వచ్చాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్సీ కోల్పోయాడు. అతని నుంచి పగ్గాలు అందుకున్న రోహిత్‌‌ శర్మ  కరోనా పాజిటివ్‌‌గా తేలి ఈ మ్యాచ్‌‌కు దూరంగా ఉన్నాడు. గురువారం ఉదయం చేసిన టెస్టులోనూ పాజిటివ్​గా తేలడంతో తను  మ్యాచ్​ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

గాయానికి సర్జరీ చేయించుకున్న  వైస్‌‌ కెప్టెన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ హాస్పిటల్‌‌ బెడ్‌‌ మీద ఉన్నాడు.  కుర్చీలాటలా మారిన ఇండియా కెప్టెన్సీ ఇప్పుడు బుమ్రాను వరించింది. రోహిత్‌‌ గైర్హాజరీలో బుమ్రా నేషనల్‌‌ టెస్టు టీమ్‌‌కు 36వ కెప్టెన్‌‌ అయ్యాడు. కపిల్‌‌ దేవ్‌‌ తర్వాత టెస్టు కెప్టెన్సీ అందుకున్న పేసర్‌‌గా ఘనత వహించాడు. బుమ్రాకు సారథ్యం కొత్త. అత్యంత కీలకమైన మ్యాచ్‌‌లో దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఫ్యూచర్‌‌ కెప్టెన్‌‌గా బుమ్రా తెరపైకి వస్తాడు. మరి, పేస్‌‌ విభాగాన్ని నడిపించినట్టే బుమ్రా జట్టును కూడా విజయవంతంగా నడిపిస్తాడో లేదో చూడాలి. ఇక, వరల్డ్‌‌ టెస్టు చాంపియన్‌‌షిప్‌‌లో మూడో స్థానంలో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్‌‌లో విజయం కీలకం కానుంది. 


కాంబినేషన్‌‌ పరేషాన్‌‌


గతేడాది నాలుగు టెస్టుల్లో అద్భుతంగా ఆడిన రెగ్యులర్‌‌ ఓపెనర్లు అయిన రోహిత్‌‌, రాహుల్‌‌ గైర్హాజరీలో మిగతా బ్యాటర్లంతా బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉంది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌తో పుజారా ఓపెనర్‌‌గా వచ్చే చాన్సుంది. కౌంటీల్లో సెంచరీలు కొట్టిన అతను ఎడ్జ్‌‌బాస్టన్‌‌లోనూ శుభారంభం ఇవ్వాలి. వన్‌‌డౌన్‌‌లో వచ్చే విహారి  డిఫెన్సివ్‌‌ గేమ్‌‌ ఆడుతాడు కాబట్టి మరో ఎండ్‌‌లో సపోర్ట్ అవసరం. ఈ నేపథ్యంలో కోహ్లీపై ఎక్కువ అంచనాలున్నాయి.  

లీస్టర్‌‌షైర్‌‌తో  వామప్‌‌ గేమ్‌‌లో కోహ్లీ బాగానే ఆడాడు. మిడిలార్డర్‌‌లో శ్రేయస్‌‌, పంత్‌‌  బాధ్యత తీసుకోవాలి. జడేజా బాల్‌‌తో పాటు బ్యాట్‌‌తోనూ రాణిస్తే జట్టుకు తిరుగుండదు. ముగ్గురు పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌‌ బరిలోకి దిగడం ఖాయమే. ఇక, బౌలింగ్‌‌ ఆల్‌‌రౌండర్‌‌గా అశ్విన్​, శార్దూల్​లో ఎవరికి చాన్స్‌‌ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. మరోవైపు ఎడ్జ్‌‌బాస్టన్​లో ఆడిన టెస్టుల్లో ఇండియా ఒక్కటి కూడా  గెలవలేదు. ఆరింటిలో ఓడి, ఒక టెస్టును డ్రా చేసు కుంది. మరి, ఈ సారి మనోళ్లు ఏం చేస్తారో చూడాలి. 


అప్పటి ఇంగ్లండ్‌‌‌‌ కాదు.. 


గతేడాది ఇండియన్స్‌‌ దెబ్బకు బిత్తరపోయిన ఇంగ్లండ్‌‌ ఇప్పుడు పూర్తిగా మారి సరికొత్తగా కనిపిస్తోంది. రూట్​ నుంచి కెప్టెన్సీ అందుకున్న బెన్​ స్టోక్స్​ సారథ్యం,  కొత్త కోచ్​ బ్రెండన్​ మెకల్లమ్​ గైడెన్స్​లో తమ ఆటను పూర్తిగా మార్చుకుంది. న్యూజిలాండ్‌‌ను మూడు టెస్టుల్లోనూ చిత్తు చేసి ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది.  కెప్టెన్సీ భారం వదులుకున్న  రూట్‌‌ వరుస సెంచరీలు కొడుతూ కెరీర్‌‌ బెస్ట్‌‌ ఫామ్‌‌లో ఉన్నాడు. ఐపీఎల్‌‌ జోరును కొనసాగిస్తున్న బెయిర్‌‌స్టో కివీస్‌‌పై దాదాపు 400 రన్స్‌‌ చేశాడు. అతని స్ట్రయిక్‌‌ రేట్‌‌ 120 కావడం గమనార్హం. ఒలీ పోప్‌‌, స్టోక్స్‌‌ కూడా టచ్‌‌లో ఉన్నారు. బ్యాటింగ్‌‌కు అనుకూలంగా ఉన్న ఫ్లాట్‌‌  పిచ్‌‌లపై ఆతిథ్య బ్యాటర్లను అడ్డుకోవడం ఇండియా పేస్‌‌  త్రయం బుమ్రా, షమీ, సిరాజ్‌‌కు సవాలే కానుంది. అదే టైమ్‌‌లో తమకు అలవాటైన పిచ్‌‌ల్లో  పేసర్లు బ్రాడ్‌‌, అండర్సన్‌‌తో పాటు కివీస్‌‌ బ్యాటర్లను వణికించిన స్పిన్నర్‌‌ జాక్‌‌ లీచ్‌‌తో ఇండియా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. 

పిచ్‌/వాతావరణం: లేత గోధుమ రంగు పచ్చికతో ఉన్న పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూ లించొచ్చు. కానీ, ఎప్పుడైనా మారొచ్చు. ఇక, శుక్రవారం మధ్యాహ్నం, శనివారం ఉదయం చిరు జల్లులు పడే అవకాశం ఉంది. 

తుది జట్లు:

ఇండియా (అంచనా): గిల్‌, పుజారా/మయాంక్‌, విహారి, కోహ్లీ, శ్రేయస్‌, పంత్ (కీపర్), జడేజా, శార్దూల్‌/అశ్విన్‌, షమీ, సిరాజ్‌, బుమ్రా (కెప్టెన్‌). 
ఇంగ్లండ్‌: లీస్‌, క్రాలీ, పోప్, రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్​ (కెప్టెన్‌), బిల్లింగ్స్‌ (కీపర్), పా ట్స్‌, బ్రాడ్‌, లీచ్‌, అండర్సన్‌.