కోల్‌కతా: ఇండియా యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (2/17) ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తన ఫస్ట్ మ్యాచ్‌లోనే సూపర్ హిట్ అయ్యాడు. ఖతర్నాక్ బాల్స్‌తో కరీబియన్ హార్డ్ హిట్టర్ల స్పీడుకు బిష్ణోయ్ బ్రేకులు వేయగా.. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (19 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) దంచి కొట్టడంతో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను ఇండియా గ్రాండ్ విక్టరీతో షురూ చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి పోరులో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత నికోలస్ పూరన్ (43 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 61) హాఫ్ సెంచరీతో విండీస్ 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది. బిష్నోయ్‌కు తోడు హర్షల్ పటేల్ (2/37) రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్‌లో రోహిత్ మెరుపులతో ఇండియా 18.5 ఓవర్లలో 162/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. రెండో మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది.
పూరన్ ధనాధన్
నికోలస్ పూరన్ ఫిఫ్టీతో రాణించినా.. ఇండియా బౌలర్లు కట్టడి చేయడంతో విండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన కరీబియన్లకు వెటరన్ పేసర్ భువనేశ్వర్ (1/31) ఫస్ట్ ఓవర్లోనే షాకిచ్చాడు. ఐదో బాల్‌కే ఓపెనర్ బ్రెండన్ కింగ్ (4)ను ఔట్ చేశాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (31) తో కలిసి పూరన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. ప్రమాదకరంగా మారుతున్న మేయర్స్‌ను చహల్ (1/34) ఏడో ఓవర్లో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆపై రవి బిష్ణోయ్ 11వ ఓవర్లో చేజ్ (4), పావెల్ (2)ను ఔట్ చేయడంతో విండీస్ 74/4తో కష్టాల్లో పడ్డది. కాసేపటికే అకీల్ హుస్సేన్ (10) కూడా పెవిలియన్ చేరాడు. కానీ, పూరన్ తగ్గలేదు. తనకు కెప్టెన్ పొలార్డ్ (24 నాటౌట్) సపోర్ట్ ఇవ్వడంతో విండీస్ ఇన్నింగ్స్ గాడిలో పడ్డది. చహల్ వేసిన 17వ ఓవర్లో 6, 4 కొట్టిన పూరన్ ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆపై హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించాడు. కానీ అదే ఓవర్ లాస్ట్ బాల్‌కు ఔటయ్యాడు. కానీ, చివరిదాకా క్రీజులో ఉన్న పొలార్డ్... విండీస్ స్కోరు 150 దాటించాడు.
రోహిత్ ఫైర్.. సూర్య, వెంకటేశ్ ఫినిషింగ్
నార్మల్ టార్గెట్ ఛేజింగ్‌లో టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. తనకు అచ్చొచ్చిన ఈడెన్‌లో కెప్టెన్ రోహిత్ స్టార్టింగ్ నుంచే భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (42 బాల్స్ లో 35) తన స్టయిల్‌కు భిన్నంగా స్లోగా ఆడగా.. హిట్‌మ్యాన్ మాత్రం తన ట్రేడ్‌మార్క్ షాట్లతో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో 5 ఓవర్లలోనే ఇండియా 57 రన్స్ సాధించింది. కానీ చేజ్ వేసిన ఎనిమిదో ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన రోహిత్ బౌండ్రీ వద్ద ఒడియన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఫస్ట్ వికెట్‌కు 64 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ (13 బాల్స్ లో 17)... ఇషాన్‌కు కాసేపు సపోర్ట్ ఇచ్చాడు. కానీ, మూడు బాల్స్ తేడాలో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరడంతో ఇండియా తడబడ్డది. ఈ టైమ్‌లో సూర్యకుమార్ (18 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 నాటౌట్) టీమ్‌ను గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. రిషబ్ పంత్ (8) ఫెయిలైనా తను బాధ్యతగా ఆడాడు. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (13 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 24 నాటౌట్)తో కలిసి కరీబియన్లకు ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. టీమ్‌లో ఫినిషర్ రోల్స్ ఆశిస్తున్న ఈ ఇద్దరూ పోటీ పడి బౌండ్రీలు కొట్టి టార్గెట్‌ను కరిగించారు. కాట్రెల్ వేసిన 17వ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాదిన సూర్య ఇండియాను విక్టరీకి దగ్గర చేశాడు. 19వ ఓవర్ ఐదో బాల్‌ను స్టాండ్స్‌కు పంపి వెంకటేశ్ మ్యాచ్‌ను ముగించాడు.

