V6 News

సిరీస్ క్లీన్ స్వీప్: విండీస్ పై 3-0తో భారత్ విజయం

సిరీస్ క్లీన్ స్వీప్: విండీస్ పై 3-0తో భారత్ విజయం
  • విండీస్​పై 3–0తో టీ20 సిరీస్ క్లీన్​స్వీప్​

 

టీ20 వరల్డ్​కప్​ నేపథ్యంలో టీమిండియా చేసిన బౌలింగ్​ప్రయోగాలు సక్సెస్​ అయ్యాయి..! ఆఖరి టీ20లో కుర్రాళ్లను బరిలోకి దింపినా.. ఫలితంలో తేడా రాకుండా చూసుకుంది..! యువ పేసర్​ దీపక్​చహర్ (3–1–4–3) తనకు ఇచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకోగా, అతని సోదరుడు రాహుల్​చహర్​ (1/27) కూడా ఫర్వాలేదనిపించాడు..! ఈ ఇద్దరికి తోడుగా సైనీ (2/34) కూడా ఎక్స్​ప్రెస్​పేస్​ వేగం చూపడంతో.. వరుసగా మూడో మ్యాచ్​లోనూ నెగ్గిన విరాట్​సేన పొట్టి ఫార్మాట్​సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసింది. ఓవరాల్​గా వరల్డ్​కప్​వైఫల్యం తర్వాత కరీబియన్​గడ్డపై సిరీస్​ను చేజిక్కించుకున్న టీమిండియా..  రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వన్డే, టెస్ట్​సిరీస్​కోసం సిద్ధమైంది..!

ఆధిపత్యానికి ఏమాత్రం తగ్గకుండా ఆడిన టీమిండియా.. కరీబియన్​ గడ్డపై సత్తా చాటింది. పెద్ద టార్గెట్​కాకపోయినా.. కెప్టెన్​విరాట్​కోహ్లీ (45 బంతుల్లో 6 ఫోర్లతో 59), రిషబ్​ పంత్​(42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 నాటౌట్) నిలకడగా ఆడటంతో మంగళవారం జరిగిన మూడో టీ20లోనూ ఇండియా 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్​పై గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్​ల సిరీస్​ను 3–0తో క్లీన్​స్వీప్​చేసింది. ముందుగా బ్యాటింగ్​చేసిన విండీస్​20 ఓవర్లలో 6  వికెట్లకు 146 రన్స్​ చేసింది. పొలార్డ్​(45 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 58) హాఫ్​ సెంచరీ చేశాడు. ఏడేళ్ల తర్వాత విండీస్​తరఫున అతను ఫిఫ్టీ మార్క్​ను అందుకున్నాడు. పావెల్​(20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 32 నాటౌట్) చెలరేగాడు.  తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇండియా 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసి నెగ్గింది. ఔట్​ఫీల్డ్​తడిగా ఉండటంతో మ్యాచ్​దాదాపు గంటన్నర ఆలస్యంగా మొదలైంది.

పొలార్డ్ కేక..

టాస్​గెలిచిన విరాట్ వాతావరణ పరిస్థితులను బట్టి  ఫీల్డింగ్​ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం కరెక్టేనని యువ పేసర్​ దీపక్​చహర్​ నిరూపించాడు. భువనేశ్వర్ తో కలిసి కొత్త బంతిని పంచుకున్న దీపక్​.. తన తొలి రెండు ఓవర్లలోనే మూడు స్ట్రయిక్​ వికెట్లు తీసి విండీస్ కు శుభారంభం దక్కకుండా చూశాడు. కేవలం ఏడు బంతుల తేడాలో నరైన్​(2), లూయిస్​(10), హెట్​మయర్​(1)ను ఔట్​చేశాడు. 14/3 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన పొలార్డ్.. రెచ్చిపోయాడు. భువీ స్థానంలో బౌలింగ్​కు వచ్చిన సైనీకి తొలి సిక్సర్​ రుచి చూపించాడు. దీపక్​మూడు ఓవర్లు వేసి పక్కకు తప్పుకోగా, ఆ స్థానంలో అతని సోదరుడు రాహుల్​ చహర్ (9వ ఓవర్​) ​బౌలింగ్​కు దిగాడు.  అయినా  పొలార్డ్.. లాంగాఫ్, బౌలర్​ నెత్తి మీద నుంచి రెండు టవరింగ్​ సిక్సర్లు బాదాడు. సుందర్​ వేసిన తర్వాతి ఓవర్​లోనూ మరో సిక్సర్​ కొట్టి జోరు పెంచాడు. ఓవరాల్​గా పవర్​ప్లేలో 22/3 గా ఉన్న స్కోరును 10 ఓవర్లు ముగిసేసరికి 58/3కి పెంచాడు. సహచరుడిని స్ఫూర్తి గా తీసుకున్న పూరన్​(17) కూడా క్రునాల్​పాండ్యా బంతిని స్టాండ్స్​లోకి పంపినా.. 14 ఓవర్ (సైనీ) తొలి బంతికి వికెట్​సమర్పించుకున్నాడు. దీంతో నాలుగో వికెట్​కు 66 రన్స్​ భాగస్వామ్యం ముగిసింది. పావెల్ నిలకడగా ఆడినా.. పాండ్యా వేసిన 15వ ఓవర్​లో పొలార్డ్​ రెండు భారీ సిక్సర్లతో 16 రన్స్​పిండుకున్నాడు. ఈ క్రమంలో 40 బంతుల్లో హాఫ్​సెంచరీ పూర్తి చేశాడు. 15 ఓవర్లు ముగిసేసరికి టీమ్​స్కోరును 100/4కు చేర్చిన పొలార్డ్ కు 16వ ఓవర్​లో సైనీ ఊహించని షాకిచ్చాడు. ఓ అద్భుతమైన బంతితో పొలార్డ్​మిడిల్​స్టంప్​ను ఎగరగొట్టడంతో ఐదో వికెట్​కు 25 పరుగులు సమకూరాయి. భారీ ఆశలు పెట్టుకున్న కెప్టెన్​ బ్రాత్​వైట్​(10) ఓ సిక్సర్​ కొట్టి ఔటైనా.. చివర్లో పావెల్, అలెన్​(8 నాటౌట్) అల్లాడించారు. ఏడు బంతుల వ్యవధిలో మూడు భారీ సిక్సర్లు బాదడంతో విండీస్​ గౌరవప్రదమైన టార్గెట్​ను నిర్దేశించింది.

కోహ్లీ, పంత్​ అదుర్స్​

టార్గెట్​ఛేజింగ్​లో ఎదుర్కొన్న మూడో బాల్​ను సిక్సర్​గా మలిచి రాహుల్​(20) టచ్​లోకి వచ్చినా.. ఇండియాకు సరైన ఆరంభం లభించలేదు. రెండో ఓవర్​లో ఓ షార్ట్​బాల్​కు ధవన్​(3) ఔట్​కాగా, ఐదో ఓవర్​లో రాహుల్​ అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. అలెన్​బంతిని క్రీజు వదిలి ఆడే క్రమంలో అతను స్టంపౌటయ్యాడు. దీంతో 27 పరుగులకే టీమిండియా 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో ఇన్నింగ్స్​ను ఆదుకునే భారం కెప్టెన్​కోహ్లీ, రిషబ్ పై పడింది. పవర్​ప్లే ముగిసేసరికి ఇండియా 34/2 స్కోరు చేసింది. తర్వాత విరాట్– పంత్​ జోడీ వేగంగా సింగిల్స్​తీయడంతో పాటు అవసరమైనప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో 4 ఓవర్లలో 28 పరుగులు రావడంతో ఇండియా స్కోరు 10  ఓవర్లలో 62/2 స్కోరుకు చేరింది. అయితే మ్యాచ్​మిడిల్​ ఓవర్లో నరైన్, బ్రాత్​వైట్ రన్స్​కట్టడి చేసే ప్రయత్నం చేసినా.. కోహ్లీ మంచి డ్రైవ్స్​తో ఆడాడు. అప్పటివరకు మెల్లగా ఆడిన పంత్​.. పాల్​బౌలింగ్​లో భారీ సిక్సర్ తో బ్యాట్ ఝుళిపించాడు. విరాట్​ఫోర్లకే పరిమితమైతే, పంత్​ మాత్రం బంతిని స్టాండ్స్​లోకి పంపేందుకు ప్రయత్నించాడు. దీంతో 14, 15, 16 ఓవర్లలో వరుసగా 10, 14, 11 రన్స్​రావడంతో ఇండియా 120 స్కోరుతో గెలుపు దిశగా పయనించింది. ఈ క్రమంలో ఇద్దరు చెరో 37 బంతుల్లో హాఫ్​ సెంచరీలు పూర్తి చేశారు.17వ ఓవర్​లో పంత్​ఓ ఫోర్​కొట్టడంతో ఇండియా విజయానికి 18 బంతుల్లో 18 రన్స్​అవసరమయ్యాయి. థామస్​వేసిన 18వ ఓవర్​తొలి బంతి వికెట్లకు తాకినా, బెయిల్స్​కిందపడలేదు. కానీ ఈ సంతోషం కోహ్లీకి ఎక్కువసేపు నిలవలేదు. మూడో బంతికే భారీ షాట్​కు ప్రయత్నించి పాయింట్​లో లూయిస్​ చేతికి చిక్కాడు.

స్కోరు బోర్డ్​..

వెస్టిండీస్: లూయిస్​ (ఎల్బీ) దీపక్​చహర్​ 10, నరైన్​(సి) సైనీ (బి) దీపక్​ చహర్​2, హెట్ మయర్​(ఎల్బీ) దీపక్​చహర్​1, పొలార్డ్​(బి) సైనీ 58, పూరన్ (సి) పంత్ (బి) సైనీ 17​, పావెల్ (నాటౌట్) 32, బ్రాత్​వైట్​(సి) సుందర్​ (బి) రాహుల్​చహర్ 10, అలెన్​(నాటౌట్) 8, ఎక్స్​ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 146/6.

వికెట్ల పతనం: 1–4, 2–13, 3–14, 4–80, 5–105, 6–119.

బౌలింగ్: భువనేశ్వర్​3–0–19–0, దీపక్​చహర్ 3–1–4–3, సైనీ 4–0–34–2, రాహుల్​చహర్​3–0–27–1, సుందర్​3–0–23–0, క్రునాల్​4–0–35–0.

ఇండియా: రాహుల్ (సి) పూరన్​(బి) అలెన్​20, ధవన్​(సి) కొట్రెల్ (బి) థామస్​3, కోహ్లీ (సి) లూయిస్​(బి) థామస్​59, రిషబ్ (నాటౌట్) 65, పాండే (నాటౌట్) 2, ఎక్స్​ట్రాలు: 1, మొత్తం: 19.1 ఓవర్లలో 150/3. వికెట్లపతనం: 1–10, 2–27, 3–133. బౌలింగ్: కొట్రెల్4–0–26–0​, థామస్​4–0–29–2, అలెన్, నరైన్​4–0–29–0, బ్రాత్​వైట్​2.1–0–25–0, పాల్​2–0–23–0. ​