యూఎస్ లెగ్ టీ20లను అలవోకగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టింది. దీంతో మంగళవారం జరిగే ఆఖరిదైన మూడో టీ20లో విండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రపంచకప్ తర్వాత తొలి సిరీస్‌ను సాధించిన విరాట్‌సేన ఇప్పుడు ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. ఫలితంతో సంబంధం లేకుండా రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు జట్టులో అందరూ టీ20 స్టార్లే అయినా.. పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కరీబియన్లు పరువు కోసం పాకులాడుతున్నారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి కొంతైన ఉపశమనం పొందాలని భావిస్తున్నారు. దీంతో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నా.. వరుణుడు ఏం చేస్తాడన్న ఉత్కంఠ కూడా మొదలైంది. రెండో మ్యాచ్‌ను అడ్డుకున్న వాన దేవుడు.. ఇప్పుడు కరీబియన్ దీవులకు కూడా వచ్చేశాడు.
బౌలింగ్‌లోనే మార్పులు!
తొలి రెండు టీ20ల్లో ఓ మాదిరి పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌కు బ్యాటింగ్ లైనప్‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశాల్లేవు. కానీ బౌలింగ్‌లో మాత్రం మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. కరీబియన్ల బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులుపడుతున్న వికెట్ కీపర్ రిషబ్ (4, 0) స్థానంలో రాహుల్ వచ్చే చాన్స్ ఉంది. లేదంటే రోహిత్, ధవన్‌లో ఒకరికి విశ్రాంతి ఇచ్చి రాహుల్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. చేతి వేలి గాయం తర్వాత ధవన్‌కు ఇదే తొలి సిరీస్ కావడం, ఇందులోనూ పెద్దగా రాణించకపోవడంతో రాబోయే వన్డే, టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని అతన్ని పక్కనబెడతారా ? లేదా? చూడాలి. మిడిలార్డర్‌లో శ్రేయస్‌కు ఓ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. బౌలింగ్‌లో రాహుల్, దీపక్ చహర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే జడేజా, సైనీ పక్కకు తప్పుకోవచ్చు. భువనేశ్వర్, ఖలీల్ తుది జట్టులోనే కొనసాగుతారు.
టాప్ ఆర్డర్ బలోపేతం..
అంచనాలను అందుకోలేకపోతున్న విండీస్.. ఈ మ్యాచ్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకున్న బౌలింగ్‌లో మార్పులు చేయడం లేదు. కానీ టాపార్డర్ బలోపేతం కోసం కొత్త ముఖాలను తీసుకొస్తున్నారు. లూయిస్‌కు ప్రత్యామ్నాయంగా క్యాంప్‌బెల్‌కు అవకాశం ఇవ్వొచ్చు. ఓపెనర్‌గా నరైన్ మెరుపుల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఐపీఎల్ పెర్ఫామెన్స్‌ను చూపిస్తే హోమ్ టీమ్‌కు తిరుగుండదు. పూరన్ స్థానంలో బ్రాంబ్లీని తీసుకురావాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మిడిలార్డర్‌లో హెట్‌మయర్, పొలార్డ్ భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నారు. బ్రాత్‌వైట్ మునుపటి ఫామ్‌ను చూపలేకపోతున్నాడు. కీలక ప్లేయర్ రస్సెల్ గాయపడటం విండీస్ లైనప్‌లో పెద్ద లోటుగా కనిపిస్తున్నది. బౌలింగ్‌లో కొట్రెల్ స్ట్రయిక్ వికెట్లు తీస్తున్నా.. పాల్, థామస్ నుంచి మరింత సహకారం అవసరం. పియరీ కూడా మెరిస్తే విండీస్ కష్టాలు తొలిగినట్లే. ఓవరాల్‌గా రాబోయే వన్డే, టెస్ట్ సిరీస్‌ల్లో ఆత్మవిశ్వాసంతో ఆడాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలని కరీబియన్లు పట్టుదలగా ఉన్నారు.
జట్లు (అంచనా)
ఇండియా: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్ / రాహుల్, రిషబ్, మనీష్ / శ్రేయస్, క్రునాల్ పాండ్యా, జడేజా / సుందర్, దీపక్ చహర్ / సైనీ, భువనేశ్వర్, ఖలీల్, రాహుల్ చహర్.
వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), క్యాంప్‌బెల్ / లూయిస్, నరైన్, పూరన్ / ఆంథోని బ్రాంబ్లీ, హెట్‌మయర్, పొలార్డ్, పావెల్, కీమో పాల్, పియరీ, కొట్రెల్, ఓషానే థామస్.

