V6 News

రెండో T20: 22 రన్స్ తో టీమిండియా విజయం

రెండో T20: 22 రన్స్ తో టీమిండియా విజయం

వరల్డ్‌‌కప్‌‌లో ఓటమి నుంచి టీమిండియా తొందరగానే తేరుకుంది. సమష్టిగా కదంతొక్కి.. పొట్టి ఫార్మాట్‌‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రోహిత్‌‌ శర్మ (51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 67)  హాఫ్‌‌ సెంచరీతో అదరగొట్టడంతో ఆదివారం జరిగిన రెండో టీ20లో 22 (డక్‌‌వర్త్‌‌ లూయిస్‌‌ పద్ధతి) పరుగుల తేడాతో వెస్టిండీస్‌‌పై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌‌ గెలిచి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రోహిత్‌‌కు తోడుగా విరాట్‌‌ కోహ్లీ(28) ఫర్వాలేదనించాడు. చివర్లో క్రునాల్‌‌ పాండ్యా (20 నాటౌట్‌‌) విలువైన ఇన్నింగ్స్‌‌ ఆడాడు. విండీస్‌‌ బౌలర్లలో కొట్రెల్‌‌ (2/25), థామస్‌‌ (2/27) రెండేసి వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన విండీస్‌‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది.  ఈ దశలో భారీ వర్షం రావడంతో ఆట సాధ్యపడలేదు. రోవ్‌‌మన్‌‌ పొవెల్‌‌(34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) హాఫ్‌‌ సెంచరీ చేశాడు.

హిట్‌‌మ్యాన్‌‌ ఒక్కడే..

టీమిండియా మిడిలార్డర్‌‌ వైఫల్యం మరోసారి బయటపడింది. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభాన్ని వృథా చేసింది. రోహిత్‌‌ క్రీజులో ఉన్నంత సేపు  200 రన్స్‌‌ స్కోరు చేసేలా కనిపించిన జట్టు మిడిలార్డర్‌‌ వైఫల్యంతో 150 దాటడానికి కూడా కష్టపడింది. తొలి వికెట్‌‌ 47 బంతుల్లో 67 రన్స్‌‌ జోడించిన ఓపెనర్లు రోహిత్‌‌––ధవన్‌‌ (23) భారీ స్కోరుకు బాటలు వేశారు. బౌండరీతో ఇన్నింగ్స్‌‌ ఆరంభించి ఫామ్‌‌ను కొనసాగించిన రోహిత్‌‌.. కొట్రెల్‌‌ వేసిన నాలుగో ఓవర్‌‌రో రెండు ఫోర్లు, కిమో పాల్‌‌ వేసిన ఆరో ఓవర్‌‌లో 6, 4 కొట్టాడు. నెమ్మదిగా ధవన్‌‌ కూడా వేగం పెంచడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే ఎనిమిదో ఓవర్‌‌లో ధవన్‌‌ను బౌల్డ్‌‌ చేసిన పాల్‌‌ విండీస్‌‌కు  బ్రేక్‌‌ అందించాడు. దీంతో కెప్టెన్‌‌ కోహ్లీ క్రీజులోకి రాగా పది ఓవర్లు పూర్తయ్యే సరికి ఇండియా 77/1తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. నరైన్‌‌ వేసిన 11వ ఓవర్‌‌లో డీప్‌‌ మిడ్‌‌వికెట్‌‌ మీదుగా భారీ సిక్స్‌‌ కొట్టిన రోహిత్‌‌ టీ20ల్లో అత్యధిక సిక్స్‌‌ల రికార్డును బద్దలుగొట్టాడు. ఆ తర్వాత రెండో బాల్‌‌కు సింగిల్‌‌ తీసి టీ20ల్లో 17వ హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. వెంటనే స్పిన్నర్‌‌ పైర్‌‌ ఓవర్‌‌లో కోహ్లీ ఓ సిక్స్‌‌ కొట్టగా, బ్రాత్‌‌వైట్‌‌ బౌలింగ్‌‌లో రోహిత్‌‌ 6, 4 బాదాడు. దీంతో భారీ స్కోరు ఖాయం అనిపించింది. అయితే  సెంచరీ చేసేలా కనిపించిన రోహిత్‌‌ను 14వ ఓవర్‌‌లో ఔట్‌‌ చేసిన థామస్‌‌.. విండీస్‌‌ను తిరిగి మ్యాచ్‌‌లోకి తెచ్చాడు.  కోహ్లీకి రిషబ్‌‌ పంత్‌‌ (4) జతకలిశాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన ఇండియా 41 రన్స్‌‌ మాత్రమే చేసింది. పంత్‌‌ను థామస్‌‌ ఔట్‌‌ చేయగా, వరుస ఓవర్లలో కోహ్లీ, మనీశ్‌‌ పాండే (6)ను కొట్రెల్‌‌ పెవిలియన్‌‌ చేర్చాడు.   అయితే పాల్‌‌ వేసిన చివరి ఓవర్‌‌లో క్రునాల్‌‌ మూడు సిక్సర్లు బాదడంతో స్కోరు 160 దాటింది. చివరి బంతికి సింగిల్‌‌ తీసిన  జడేజా (9 నాటౌట్‌‌) ఇన్నింగ్స్‌‌ను ముగించాడు.

పొవెల్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీ

ఛేజింగ్‌‌‌‌లో విండీస్‌‌‌‌కు సరైన ఆరంభం దొరకలేదు.  మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి ఓపెనర్లు పెవిలియన్‌‌‌‌ చేరారు. ఎవిన్‌‌‌‌ లూయిస్‌‌‌‌ (0) భువీకి రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌ ఇవ్వగా, సునీల్‌‌‌‌ నరైన్‌‌‌‌ (4)ను సుందర్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేశాడు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన నికోలస్‌‌‌‌ పూరన్‌‌‌‌(19) నెమ్మదిగా ఆడగా పొవెల్‌‌‌‌ ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌‌‌‌లు బాదేసి ఒక్కసారిగా రన్‌‌‌‌రేట్‌‌‌‌ పెంచాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి విండీస్‌‌‌‌ 62/2పై నిలిచింది. ఆ తర్వాత క్రునాల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో మరో సిక్స్‌‌‌‌ కొట్టిన పొవెల్‌‌‌‌.. సైనీ వేసిన ఓవర్‌‌‌‌లో సింగిల్‌‌‌‌ తీసి హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేశాడు. ఇందుకోసం అతను 30 బంతులు తీసుకున్నాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరిని క్రునాల్‌‌‌‌ 14వ ఓవర్‌‌‌‌లో ఔట్‌‌‌‌ చేశాడు. క్రునాల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో భారీ షాట్‌‌‌‌ ఆడిన పూరన్‌‌‌‌  బౌండ్రీ లైన్‌‌‌‌ దగ్గర మనీశ్‌‌‌‌కు దొరికిపోగా, పొవెల్‌‌‌‌ ఎల్బీ అయ్యాడు. పొలార్డ్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌ క్రీజులో ఉండగా చివరి ఐదు ఓవర్లలో విండీస్‌‌‌‌ విజయానికి 73 రన్స్‌‌‌‌ దూరంలో నిలిచింది. అయితే 15.3 ఓవర్లకు  98/4  వద్ద వెలుతురు లేమి వల్ల మ్యాచ్‌‌‌‌ నిలిచిపోయింది.

స్కోరుబోర్డ్‌‌

ఇండియా : రోహిత్‌‌ (సి) హెట్‌‌మయర్‌‌ (బి) థామస్‌‌ 67, ధవన్‌‌(బి) పాల్‌‌ 23, కోహ్లీ (బి) కొట్రెల్‌‌ 28, పంత్‌‌ (సి) పొలార్డ్‌‌ (బి) థామస్‌‌ 4, మనీశ్‌‌(సి)పూరన్‌‌ (బి) కొట్రెల్‌‌ 6, క్రునాల్‌‌ (నాటౌట్‌‌) 20, జడేజా (నాటౌట్‌‌) 9 , ఎక్స్‌‌ట్రాలు : 10 ; మొత్తం : 20 ఓవర్లలో 167/5. వికెట్ల పతనం : 1-–67, 2–-115, 3– 126, 4-–132, 5–-143. బౌలింగ్‌‌ : థామస్‌‌ 4–0–27–2, కొట్రెల్‌‌ 4–0–25–2, నరైన్‌‌ 4–0–28–0, కిమో పాల్‌‌ 4–0– 46–1, బ్రాత్‌‌వైట్‌‌ 2–0–22–0, పైర్‌‌ 2–0–16–0.

వెస్టిండీస్‌‌ : నరైన్‌‌(బి) సుందర్‌‌ 4, లూయిస్‌‌ (సి) అండ్‌‌(బి) భువనేశ్వర్‌‌ 0, పూరన్‌‌ (సి) మనీశ్‌‌(బి) క్రునాల్‌‌ 19, పొవెల్‌‌ (ఎల్బీ) క్రునాల్‌‌ 54, పొలార్డ్‌‌ (నాటౌట్‌‌) 8, హెట్‌‌మయర్‌‌ (నాటౌట్‌‌) 6, ఎక్స్‌‌ట్రాలు :7 ; మొత్తం : 15.3 ఓవర్లలో 98/4.  వికెట్ల పతనం : 1– 2, 2–8, 3–84, 4–85.  బౌలింగ్‌‌ : సుందర్‌‌ 3–1–12–1, భువనేశ్వర్‌‌ 2–0–7–1, ఖలీల్‌‌ 3–0–22–0, సైనీ  3–0–27–0, క్రునాల్‌‌ 3.3–0–23–2, జడేజా 1–0–6–0.