న్యూఢిల్లీ: భారత వాయుసేనకు మరో 5 తేజస్ ఫైటర్ జెట్లు సమకూరనున్నాయి. వాటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు డెలివరీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) గురువారం వెల్లడించింది. వీటితోపాటు మరో 9 తేజస్ ఫైటర్ జెట్లను కూడా సిద్ధం చేశామని, కానీ వాటిలో అమర్చాల్సి ఉన్న ఇంజన్లు అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది. ఆ ఇంజన్లు రాగానే ఈ 9 జెట్ లను కూడా డెలివరీ చేస్తామని పేర్కొంది.
కాగా, వాయుసేనకు మొత్తం 83 తేజస్ ఎంకే1ఏ ఫైటర్ జెట్ల సరఫరా కోసం హెచ్ఏఎల్తో రక్షణ శాఖ రూ.48 వేల కోట్లతో 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ జీఈ ఏరోస్పేస్ కంపెనీ నుంచి ఇంజన్ ల సరఫరాలో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఒప్పందం ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికల్లా ఐఏఎఫ్‌కు 6 తేజస్ ఫైటర్ జెట్లను అందించాల్సి ఉంది.
