ఆఫ్రికా దేశం రువాండాలో తొలి కరోనా కేసు: పేషెంట్ ఇండియన్

ఆఫ్రికా దేశం రువాండాలో తొలి కరోనా కేసు: పేషెంట్ ఇండియన్

తూర్పు ఆఫ్రికా దేశం రువాండాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అయితే అక్కడ కరోనా బారిన పడిన తొలి పేషెంట్ ఇండియన్ అని శనివారం ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అతడు మార్చి 8న ముంబై నుంచి రువాండాలోని కిగాలికి వెళ్లినట్లు తెలిపింది.

‘రువాండాలోని విమానాశ్రయంలో దిగిన సమయంలో ఆ పేషెంట్‌కు ఎటువంటి లక్షణాలు లేవు. మార్చి 13న జలుబు దగ్గు, తీవ్ర జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. అతడి శాంపిల్స్ టెస్టు చేయగా కరోనా ఉన్నట్లు తేలింది’ అని తెలియజేస్తూ రువాండా ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ పేషెంట్‌ను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించింది. అతడు రువాండాలో దిగిన తర్వాత ఎవరెవరిని కలిశాడో గుర్తించి, వారికి కూడా టెస్టులు చేస్తామని తెలిపింది. తూర్పు ఆఫ్రికా దేశాలన్నింటిలోనూ ఇది రెండో కరోనా పాజిటివ్ కేసు. కెన్యాలో శుక్రవారం ఒకరు కరోనా బారినపడగా.. రువాండాలో ఇవాళ రెండో కేసు నమోదైంది.

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికే దాదాపు 140 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 5 వేల మంది వైరస్ బారినపడి మరణించగా.. లక్షా 50 వేల వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత్‌లో 84 మందికి కరోనా సోకగా.. ఇద్దరు మరణించారు. పది మంది పేషెంట్లు చికిత్స తర్వాత పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.