ఫ్లైట్లో హార్ట్ స్ట్రోక్.. ట్రీట్మెంట్ ఎలా చేశారంటే..

ఫ్లైట్లో హార్ట్ స్ట్రోక్..  ట్రీట్మెంట్ ఎలా చేశారంటే..

విమాన ప్రయాణంలో గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తికి ఓ డాక్టర్ అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. బర్మింగ్‌హామ్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రిలో లివర్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న డా. విశ్వరాజ్ వేమల(48) సదరు వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు పొందాడు. డాక్టర్ వేమల తల్లితో కలిసి లండన్ నుంచి AI128 విమానంలో బెంగుళూరుకు వస్తుండగా మార్గమధ్యంలో తోటి ప్రయాణికునికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో విమానంలో ఉన్నవారంతా ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన డా. వేమల 5 గంటల పాటు శ్రమించి, అతని ప్రాణాలు కాపాడారు. ఫ్లైట్ లో అందుబాటులో ఉన్న మెడికల్ కిట్ తో పాటు ప్రయాణికులు అందించిన కొన్ని వస్తువుల సాయంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు.

విమానంలో ఆక్సిజన్, ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్ లేకపోవడంతో పేషెంట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కష్టమైందని డాక్టర్ విశ్వరాజ్ అన్నారు. ప్యాసింజర్లు ఇచ్చిన హార్ట్ రేట్ మానిటర్, పల్స్ ఆక్సిమీటర్, గ్లూకో మీటర్, బీపీ మెషిన్ తో చికిత్స అందించినట్లు చెప్పారు. అయితే కాసేపటికే రెండోసారి కూడా పేషెంట్ కు హార్ట్ స్ట్రోక్ రావడంతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని డాక్టర్ చెప్పారు. పాకిస్థాన్ లో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. దీంతో పైలెట్ విమానాన్ని ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎయిర్ పోర్టు సిబ్బంది సాయంతో పేషెంట్ ను హాస్పిటల్ కు తరలించారు. విమానంలో తన ప్రాణాలు కాపాడిన డాక్టర్ వేమలకు పేషెంట్ కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాడు.