- పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 150 క్యాంటీన్లు
- వీటిలో అన్ని చోట్ల లంచ్, 60 చోట్ల బ్రేక్ఫాస్ట్
- రెండు నెలల్లో కొత్త వార్డుల్లో 150 కేంద్రాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాత జీహెచ్ఎంసీ పరిధిలో రూ.5 కే ఆకలి తీరుస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లను ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరించాలని బల్దియా నిర్ణయించింది. ప్రతి వార్డుకు ఒక ఇందిరమ్మ క్యాంటీన్ చొప్పున 300 వార్డుల్లో 300 క్యాంటీన్లు ఉండేలా ప్లాన్చేస్తోంది. ఇప్పటికే పాత జీహెచ్ఎంసీ పరిధిలో150 క్యాంటీన్లు ఉండగా, అన్ని చోట్ల లంచ్, మొదటి దశలో 60 చోట్ల బ్రేక్ఫాస్ట్పెడుతున్నారు. సెకండ్ ఫేజ్లో మిగిలిన వాటిలో కూడా బ్రేక్ఫాస్ట్పెట్టనున్నారు. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన150 వార్డుల్లోనూ 150 క్యాంటీన్లను రెండు నెలల్లో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. క్యాంటీన్ల కోసం అవసరమైన స్థలాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పనపై ఇప్పటికే దృష్టి పెట్టింది.
రూ.29 భరిస్తున్న జీహెచ్ఎంసీ
పేదలకు తక్కువ ధరకే భోజనం పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం 2013లోనే రూ.5 కే భోజనం అంటూ అన్నపూర్ణ కేంద్రాలను ప్రారంభించింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో మొదటి సెంటర్ఏర్పాటు చేసింది. సిటీలోని పేదలు, కూలీలు, వివిధ పనుల మీద సిటీకి వచ్చేవారందరికీ రూ.5కే భోజనం అందించాలని 139 కేంద్రాలకు విస్తరించింది. ఇప్పుడు వీటి సంఖ్య 150కి పెరిగింది. వీటి ద్వారా రోజూ 30 వేల మంది ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ భోజనంలో 400 గ్రాముల అన్నం , 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల కర్రీ, 15 గ్రాముల పచ్చడి పెడుతున్నారు. ప్లేటుకు రూ.29.63 ఖర్చవుతుండగా, లబ్ధిదారులు రూ.5, జీహెచ్ఎంజీ రూ.24.83 భరిస్తోంది. ఈ స్కీం కోసం జీహెచ్ఎంసీ ఏడాదికి రూ.15 కోట్లను ఖర్చు చేస్తోంది. ఇది సక్సెస్ కావడంతో రూ.5 బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని గతేడాది ప్రారంభించింది. ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీ, పొంగల్ వంటి టిఫిన్లు రూ. 5కే పెడుతోంది. బ్రేక్ ఫాస్ట్ కి రూ.19 ఖర్చవుతుండగా, రూ.5 లబ్ధిదారులు, రూ.14 జీహెచ్ఎంసీ భరిస్తుంది. కొన్నిచోట్ల దాతలు లబ్ధిదారులు చెల్లించే రూ.5 ఇస్తుండగా, ఫ్రీగా భోజనం, బ్రేక్ ఫాస్ట్ పెడుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్దల జ్ఞాపకార్థం కూడా చాలామంది లబ్ధిదారులు ఇచ్చే రూ. 5 చెల్లిస్తే ఫ్రీగా భోజనం పెడుతోంది.
