నేటి నుంచి మిల్లుల్లో తనిఖీలు

నేటి నుంచి మిల్లుల్లో తనిఖీలు

హైదరాబాద్‌‌, వెలుగు: రైస్‌‌ మిల్లర్ల నుంచి కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌(సీఎంఆర్‌‌) సేకరణ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులను సివిల్‌‌ సప్లయ్స్‌‌ సంస్థ చైర్మన్‌‌ సర్దార్‌‌ రవీందర్‌‌ సింగ్‌‌ ఆదేశించారు. సీఎంఆర్‌‌లో జరుగుతున్న జాప్యంపై సివిల్‌‌ సప్లయ్స్‌‌ భవన్‌‌లో కమిషనర్‌‌ అనిల్‌‌ కుమార్‌‌తో కలిసి శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్‌‌ సింగ్‌‌ మాట్లాడుతూ, సీఎంఆర్‌‌ సేకరణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, ఎఫ్‌‌సీఐకి అప్పగించేందుకు 25 మంది సివిల్‌‌ సప్లయ్స్‌‌ సంస్థ విజిలెన్స్‌‌ అండ్‌‌ ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌, సంస్థ ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఈ బృందాలు శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైసు మిల్లుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాయని చెప్పారు. ముందుగా సీఎంఆర్‌‌ పెండింగ్‌‌లో ఉన్న జిల్లాల నుంచి తనిఖీలు ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం కేటాయించిన వడ్లు రైసు మిల్లుల్లో ఉందా.. లేదా..? గడువు ప్రకారం సీఎంఆర్‌‌ అప్పగించారా..? పెండింగ్‌‌ ఉన్న సీఎంఆర్‌‌ ఎంత? తదితర వాటిని తనిఖీ చేయాలని సూచించారు. ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని అమ్ముకున్న రైసు మిల్లర్లపై క్రిమినల్‌‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సీఎంఆర్‌‌లో జాప్యం చేస్తున్న మిల్లుల నుంచి ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలించాలని సూచించారు.