హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బీమా పథకాన్ని రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేయడంపై తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ పథకం వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప భరోసానిస్తుందన్నారు. ప్రజా పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఔట్సోర్సింగ్ఉద్యోగులను కూడా సంక్షేమ పథకం పరిధిలోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్, అధ్యక్షుడు పుల్లగుర్ల రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుర్రి వినోద్, రాష్ట్ర ఔట్ సోర్సింగ్ వైస్ ప్రెసిడెంట్ పొన్నమలై యాదగిరి సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సంబంధిత శాఖ మంత్రులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ పథకం ప్రయోజనాలు అందేలా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
