- కిలో రూ. కోటి విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ ముఠా గుట్టురట్టయింది. మార్కెట్‌లో కిలో రూ. కోటి వరకు విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాయిని థాయ్‌లాండ్ నుంచి మన దేశానికి స్మగ్లింగ్ చేస్తున్న ఓ విదేశీ మహిళను, సిండికేట్‌లోని మరో 10 మంది సప్లయర్లను ఈగల్ ఫోర్స్ అధికారులు ఢిల్లీ, ముంబైలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 కిలోల హైడ్రోపోనిక్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు అధికారులు విచారణ చేపట్టారు.
ఈ అంతర్జాతీయ సిండికేట్ నుంచి కోట్లాది రూపాయల విలువైన గంజాయితో పాటు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైడ్రోపోనిక్ గంజాయిని థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు తరలించేందుకు..పెద్ద ఎత్తున స్మగ్లింగ్ సిండికేట్లు పనిచేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. నెల రోజలుగా సెర్చ్ ఆపరేషన్ చేసిన అధికారులు ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. సమావేశంలో ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ముఠా అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
