న్యూఢిల్లీ: బీసీసీఐకి మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి మరో కంపెనీ తప్పుకుంది. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ డీల్ నుంచి ఫ్యూచర్ గ్రూప్ వైదొలిగిందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి స్పష్టం చేశారు. ‘అవును. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ డీల్ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంది. మేం రీప్లేస్‌మెంట్ కోసం చూస్తున్నాం’ అని సదరు అఫీషియల్ చెప్పారు. బీసీసీఐతో ఫ్యూచర్ గ్రూప్ స్పాన్సర్‌షిప్ డీల్ ఎలాగూ ఎండింగ్‌కు వచ్చిందని సమాచారం. అయితే ఫ్యూచర్ గ్రూప్ ముందే వైదొలిగితే బోర్డుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయంపై ఫ్యూచర్ గ్రూప్ స్పందించింది.
‘ఫ్యూచర్ గ్రూప్ వైదొలగాలని నిర్ణయించింది. ఎందుకంటే కాస్ట్ చాలా ఎక్కువైంది. అలాగే రీనెగోషియేషన్ కూడా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ, పెనాల్టీ చెల్లిస్తేనే దీనికి ఒప్పుకుంటామని బీసీసీఐ పేర్కొంది’ అని ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఒక టాప్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఫ్యూచర్ గ్రూప్ వైదొలగడం ద్వారా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇండో–చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ దేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయరీ సంస్థ వివో మెగా టోర్నీ టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలిగింది. దీంతో బిడ్డింగ్‌కు ఆహ్వానించగా.. ఈ ఏడాదికి ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ రైట్స్‌ను ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ అయి డ్రీమ్ 11 దక్కించుకుంది.

