టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతలతోప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ ఇండియాకు గుడ్ న్యూస్ చెప్పింది ఇరాన్. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ జల సంధి గుండా వెళ్లేందుకు భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇరాన్. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కీలక ప్రకటన చేశారు.
హోర్ముజ్ జలసంధి గుండా భారతదేశంతో సహా ఇరాన్ స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఇండియాతో పాటు చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ నౌకలు కూడా ఈ మార్గం గుండా ప్రయాణించవచ్చని తెలిపారు. అయితే.. ఇరాన్‌పై దాడులకు మద్దతు ఇవ్వకుండా, భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని షరతులు విధించారు. హార్మూజ్ గుండా ప్రయాణించే నౌకలు ముందుగానే ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
కాగా, అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ హార్మూజ్ జల సంధిని మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ముడి చమురు కోసం ఎక్కువగా గల్ఫ్‌పై ఆధారపడ్డ భారత్‌కు హార్మూజ్ జల సంధి మూసివేత ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో హార్మూజ్ గుండా ఇండియా నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతి ఇవ్వడంతో దేశంలో ఇంధన సమస్య కొంత వరకు తీరే అవకాశం ఉంది.
యుద్ధం ముగించే ఆలోచన లేదు:
యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న అమెరికా శాంతి ప్రణాళికను అబ్బాస్ అరాఘ్చి తోసిపుచ్చారు. యుద్ధం ముగింపు గురించి అమెరికాతో ఎలాంటి చర్చలు జరపలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై అమెరికాతో చర్చలు జరిపే ప్రణాళిక కూడా ఇరాన్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తులతో రాయబారం పంపుతోందని.. దీనిని అధికారిక శాంతి చర్చలుగా ఇరాన్ పరిగణించడం లేదని తెలిపారు. మధ్యవర్తుల ద్వారా సందేశాలు పంపించుకోవడం అంటే అమెరికాతో చర్చలు జరపడం కాదన్నారు.
ఈ యుద్ధంలో అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని పేర్కొన్నారు. త్వరిత విజయం, ఇరాన్ ప్రభుత్వ మార్పు వంటి అమెరికా యుద్ధ లక్ష్యాలు నేరవేరలేదని చెప్పారు. ఏ దేశం కూడా ఇరాన్ భద్రతకు ముప్పు కలిగించలేదని నిరూపించామన్నారు. ఇరాన్ పొరుగు దేశాలకు అమెరికాకు దూరంగా ఉండాలని సూచించారు. ఇరాన్ సుదీర్ఘ యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. ఈ సంఘర్షణకు శాశ్వత ముగింపును కోరుకుంటోందని తమ వైఖరిని అరాఘ్చి స్పష్టం చేశారు.
#Iran FM Abbas #Araghchi: We permitted passage through the Strait of #Hormuz for friendly nations including China, Russia, India, Iraq, and Pakistan. pic.twitter.com/RvLtiwYB4v
— Consulate General of the I.R. Iran in Mumbai (@IRANinMumbai) March 25, 2026
