మరణించిన 4 నెలల తర్వాత..జూన్ 21న ఖమేనీ అంత్యక్రియలు

మరణించిన 4 నెలల తర్వాత..జూన్ 21న ఖమేనీ అంత్యక్రియలు
  • మూడ్రోజుల పాటు ప్రజల సందర్శనార్థం భౌతికకాయం

టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇరాన్‌‌లోని పవిత్ర నగరం మషద్‌‌లోని ‘ఇమామ్ రెజా’ దర్గా సమీపంలో ఆయన అంతిమ సంస్కారాలు చేపట్టనున్నారు. ఖమేనీ మరణించిన నాలుగు నెలల తర్వాత ఆయనకు తుది వీడ్కోలు పలుకనున్నారు. 

జూన్ 21న ఈ కార్యక్రమం జరుగనుంది. అంతకు ముందు ప్రజల సందర్శన, నివాళులు అర్పించడం కోసం ఖమేనీ భౌతికకాయాన్ని మూడ్రోజుల పాటు అందుబాటులో ఉంచనున్నారు. ప్రధాన అంత్యక్రియల కార్యక్రమం సుమారు 24 గంటల పాటు కొనసాగనుందని, ఆ తర్వాత మతపరమైన కేంద్రం కోమ్ మీదుగా మషద్ సిటీ వరకు అంతిమ యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అనంతరం మషద్‌‌లోని ఇమామ్ రెజా దర్గాలో ఖమేనీ భౌతికకాయాన్ని సమాధి చేస్తారు. 

ఇస్లాం సాంప్రదాయం ప్రకారం మరణించిన కొన్ని రోజుల్లోనే అంత్యక్రియలు పూర్తిచేయాలి. కానీ, యుద్ధ వాతావరణం, పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆలస్యం జరిగిందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ క్యాలెండర్ ప్రకారం.. ఖమేనీ అంత్యక్రియలను జూన్ 21 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఐఆర్‌‌‌‌జీసీ ఆధ్వర్యంలో అందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

అంత్యక్రియలకు 2 కోట్ల మంది వచ్చే చాన్స్ 

అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు టెహ్రాన్, కోమ్, మషద్ సిటీల నుంచి దాదాపు 2 కోట్ల మంది తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహొల్లా ఖమేనీ అంత్యక్రియలకు గతంలో దాదాపు కోటి మంది హాజరయ్యారు. నాటి ఇరాన్ జనాభాలో ఇది ఆరో వంతు. 

ఒక దేశ జనాభాలో ఇంత పెద్ద ఎత్తున అంత్యక్రియలకు హాజరుకావడం ప్రపంచంలోనే ఇదే తొలిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌లో నమోదైంది. నాటి తొక్కిసలాటలో ఎనిమిది మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు. ఈసారి అంతకంటే రెట్టింపు జనాభా వచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.