డ్రాప్ సైట్ కథనంలో సంచలనం.. ట్రంప్‌‌‌‌‌‌‌‌ను డీల్ చేసేందుకు సైకాలజిస్టుల సాయం

డ్రాప్ సైట్ కథనంలో సంచలనం.. ట్రంప్‌‌‌‌‌‌‌‌ను డీల్ చేసేందుకు సైకాలజిస్టుల సాయం
  •     ‘డ్రాప్ సైట్’ న్యూస్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌  కథనంలో వెల్లడి 

టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో శాంతి ఒప్పందంపై చర్చలు జరుపుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అస్థిరమైన ప్రవర్తన’ను తట్టుకోవడానికి ఇరాన్ ప్రతినిధుల బృందం సీనియర్ సైకాలజిస్టుల సహాయం తీసుకున్నట్లు సమాచారం. ట్రంప్ మానసిక స్థితిని అంచనా వేయడానికి, ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా అమెరికా అధ్యక్షుడికి పంపే సందేశాలను రూపొందించడంలో ఇరాన్ చర్చల ప్రతినిధులకు సహాయం చేయడానికి ఇద్దరు సీనియర్ సైకాలజిస్టుల బృందాన్ని నియమించినట్లు ‘డ్రాప్ సైట్’ న్యూస్ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్ వెల్లడించింది. ట్రంప్ స్వభావం తరచూ మారుతుండటంతో ఆయనను మెరుగ్గా అర్థం చేసుకుని చర్చలు జరపడానికి ఇరాన్ ఈ వినూత్న వ్యూహాన్ని ఉపయోగించింది. ‘‘ట్రంప్ మానసిక ప్రవర్తనా సరళిని మేం గమనించాం.

వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఆయనకు పంపే సందేశాలను రూపొందించడం కోసం మా చర్చల సలహాదారుల కమిటీలో ఇద్దరు సీనియర్ సైకాలజిస్టులను చేర్చాం” అని ఇరాన్ అధికారి ఒకరు వెల్లడించినట్టు డ్రాప్​సైట్‌‌‌‌‌‌‌‌ తెలిపింది. ఈ కథనం ప్రకారం.. శాంతి ఒప్పందానికి సంబంధించి తాత్కాలిక అవగాహన ఒప్పందం నిబంధనలను అమెరికా, ఇరాన్ పరస్పరం పంచుకోవడం ప్రారంభించిన తర్వాత, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ఇస్లామాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మొదటి రౌండ్ ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ మానసిక నిపుణులు ఇరాన్ బృందానికి సాయం చేయడం ప్రారంభించారు.‘‘ఈ సలహాదారుల సూచనలను మా సందేశాలు, లిఖితపూర్వక సమాచారంలో చేర్చడం ప్రారంభించినప్పటి నుంచి ట్రంప్ స్పందనలలో సానుకూల మార్పు కనిపించింది’’ అని ఆ అధికారి తెలిపారు. పరస్పరం మార్పిడి చేసుకున్న ఈ పత్రాలు భవిష్యత్తులో చారిత్రక రికార్డులుగా మిగిలిపోతాయని, రాబోయే సంవత్సరాల్లో ఈ సమాచారం బహిరంగమైతే ఇరుపక్షాల చర్చల నైపుణ్యాలు, వాటి తీవ్రత ఎంతటిదో స్పష్టంగా తెలిసేలా ఇరాన్ ఈ చర్చలను నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు.