నిన్నటి వరకూ వరుసగా లాభాలతో కొనసాగిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకుంది. నేడు మార్కెట్లు ప్రారంభం నుంచే తీవ్రంగా నష్టపోవటానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలే. వాస్తవానికి ఇరాన్ అమెరికా మధ్య రెండో దఫా శాంతి చర్చలకు నీలినీడలు అలుముకోవటం ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్లతో పాటుగా.. ఇండియన్ మార్కెట్లపై కూడా పడింది. ఇరాన్ దిగి వస్తుందా లేక యుద్ధం తిరిగి స్టార్ట్ అవుతుందా అనే అనుమానాలు ఇన్వెస్టర్లను కలచి వేస్తున్నాయి.
ఈ క్రమంలో ఉదయం 10.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 747 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 200 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 260 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 49 పాయింట్ల నష్టంతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ప్రధానంగా నేడు మార్కెట్లలో ఐటీ రంగానికి చెందిన కీలక స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురికావటంతో అవి మార్కెట్లను నష్టాల్లోకి లాగుతున్నాయి. దీనికి తోడుగా గత కొద్ది రోజులుగా వరుసగా మార్కెట్లు లాభాల్లో పయనించటంతో చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపుతూ అమ్మకాలకు దిగటం.. ముందస్తుగా గెయిన్స్ బుక్ చేసుకోవటంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో అమెరికా ఇరాన్ చర్చలు విఫలం అయితే మళ్లీ క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్ల మార్కును దాటతాయనే భయాలు కూడా మార్కెట్లను నష్టాల్లోకి నెట్టేసింది. ఈ రోజు ఇంట్రాడేలో ఐటీ, ఫైనాన్స్ స్టా్క్స్ నష్టాల్లో కొనసాగుతుండగా.. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మాత్రం ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ చూస్తున్నాయి.

