ఆడుతోంది ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్..! తలపడుతోంది టీ20ల్లో నంబర్ వన్ టీమ్తో..! ఎదుర్కొంటోంది వరల్డ్క్లాస్ బౌలర్లను..! అయినా సరే అతని కళ్లలో భయం లేదు..! అతను కొట్టే షాట్లకు తిరుగులేదు..! బంతి దొరికిందా.. బాదేయడమే..! షాట్ కనెక్ట్ అయిందా అది బౌండ్రీ అవతల పడటమే..! తోడుగా ఉన్న క్రికెట్ బాద్షా విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయేలా.. అభిమానులు అచ్చెరువొందేలా సాగింది టీమిండియా కొత్త హీరో ఇషాన్ కిషన్ (32 బాల్స్లో 5 ఫోర్లు, 4 సిక్సర్తో 56) బ్యాటింగ్..! ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున సెన్సేషనల్ ఆటతో అదరగొట్టిన ఈ యంగ్స్టర్ నేషనల్ టీమ్లోకి షాన్దార్ ఎంట్రీ ఇచ్చాడు..! సీనియర్ శిఖర్ ధవన్ ప్లేస్లో అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ కుర్రాడు డైనమైట్లా పేలాడు..! ఇంగ్లండ్ బౌలింగ్ను ఉతికేస్తూ ఫిఫ్టీ కొట్టేశాడు..! గత మ్యాచ్లో డకౌటైన కెప్టెన్ కోహ్లీ (49 బాల్స్లో 5ఫోర్లు,3 సిక్సర్లతో 73 నాటౌట్) కూడా ఫామ్ అందుకున్నాడు..! క్లాసిక్ షాట్లతో ఫిఫ్టీ కొట్టేయడంతో సెకండ్ టీ20లో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది! అంతకుముందు బౌలర్లూ ఆకట్టుకున్నా.. మ్యాచ్లో టాప్ స్కోరర్ కోహ్లీనే అయినా.. డేరింగ్ బ్యాటింగ్తో ఇషాన్ హీరోగా నిలిచాడు..! అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది..!
అహ్మదాబాద్: స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్న బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించగా.. అరంగేట్రం ఆటగాడు ఇషాన్ కిషన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ధనాధన్ బ్యాటింగ్తో అదరగొట్టడంతో తొలి మ్యాచ్ ఓటమికి ఇంగ్లండ్పై టీమిండియా బదులు తీర్చుకుంది. ఆల్రౌండ్ షోతో మెప్పించిన హోమ్టీమ్ ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఐదు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. వన్సైడెడ్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇచ్చిన 165 టార్గెట్ను కోహ్లీసేన 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేజ్ చేసింది. రిషబ్ పంత్ (13 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26) కూడా రాణించాడు. అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 రన్స్ చేసింది. ఓపెనర్ జేసన్ రాయ్ (35 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) మరోసారి అదరగొట్టాడు.హోమ్టీమ్ బౌలరల్లో వాషింగ్టన్ సుందర్ (2/29), శార్దూల్ ఠాకూర్ (2/29) చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో ఇషాన్తో పాటు సూర్యకుమార్ ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు. మూడో మ్యాచ్ మంగళవారం జరుగుతుంది.
రాయ్ ఓపెనింగ్.. బౌలర్ల ఫినిషింగ్
టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఇండియాకు పేసర్ భువనేశ్వర్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఇన్నింగ్స్ మూడో బాల్కే ఓపెనర్ జోస్ బట్లర్ (0)ను ఎల్బీ చేసి ఇంగ్లండ్కు షాకిచ్చాడు. అయితే, మరో ఓపెనర్ జేసన్ రాయ్, వన్డౌన్లో వచ్చిన డేవిడ్ మలన్(24)దూకుడుగా ఆడారు. గత మ్యాచ్లో మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన రాయ్ ఈ సారి కూడా షాట్లకే మొగ్గు చూపాడు. సెకండ్ ఓవర్లో స్పిన్నర్ సుందర్కు భారీ సిక్సర్తో వెల్కమ్ చెప్పాడు. మలన్ కూడా జోరు చూపడంతో పవర్ప్లేలో ఇంగ్లండ్ 44/1తో నిలిచింది. తొమ్మిదో ఓవర్లో మలన్ను ఎల్బీ చేసిన చహల్ సెకండ్ వికెట్కు 63 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసినా రాయ్ వెనక్కు తగ్గలేదు. అదే ఓవర్లో రెండు ఫోర్లతో మరింత రెచ్చిపోయాడు. 11వ ఓవర్లో అతనిచ్చిన రిటర్న్ క్యాచ్ను చహల్ అందుకోలేకపోయాడు. కానీ, సుందర్ వేసిన తర్వాతి ఓవర్లో మరో భారీ షాట్ ఆడిన రాయ్ .. భువీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న బెయిర్స్టో (20), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ( 28) ఓవర్కో బౌండ్రీ కొడుతూ రన్రేట్ తగ్గకుండా చూసుకున్నారు. కానీ, 14వ ఓవర్లో బెయిర్స్టోను సుందర్ వెనక్కుపంపాడు. అప్పటికి 14వ ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 120/4. అక్కడి నుంచి ఇండియా పేసర్లు హార్దిక్, భువీ, ఠాకూర్ గొప్పగా పుంజుకున్నారు. మోర్గాన్ వికెట్ తీసి హార్డ్ హిట్టర్ స్టోక్స్ (24)షాట్లు ఆడకుండా నియంత్రించారు. 19వ ఓవర్లో తన 17వ బాల్కు స్టోక్స్ బౌండ్రీ కొట్టగలిగాడు. ఇక, లాస్ట్ ఓవర్లో స్టోక్స్ను ఔట్ చేసిన ఠాకూర్ 6 రన్సే ఇచ్చాడు. ఓవరాల్గా చివరి 5 ఓవర్లలో ఇండియా రెండు వికెట్లు తీసి35 రన్స్ మాత్రమే ఇచ్చింది. అందులో రెండే ఫోర్లు ఉన్నాయంటే మన బౌలింగ్ ఎలా ఉందో చెప్పొచ్చు.
ఇటు కిషన్... అటు కోహ్లీ
ఛేజింగ్లో ఇండియా ఖాతానే తెరవకుండా వికెట్ కోల్పోయింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (0) మళ్లీ ఫెయిలయ్యాడు. ఫస్ట్ ఓవర్లో వరుసగా ఐదు డాట్ బాల్స్ వేసిన సామ్ కరన్ ఆ వెంటనే లైన్ మార్చి సంధించిన ఔట్ స్వింగర్ను వెంటాడి కీపర్ బట్లర్కు చిక్కాడు. అయినా ఇండియా ఈజీగా గెలిచిందంటే కారణం ఇషాన్ కిషన్ ఫియర్లెస్ ఆటే అనొచ్చు. తన ఫస్ట్ బాల్నే బౌండ్రీకి చేర్చిన కిషన్ ఆటను వన్సైడ్ చేసేశాడు. మరో ఎండ్లో కెప్టెన్ కోహ్లీ కూడా క్లాసిక్ షాట్లతో ఫోర్లు రాబట్టాడు. ఐదో ఓవర్లో అతనిచ్చిన క్యాచ్ను కీపర్ బట్లర్ డ్రాప్ చేశాడు. ఈ లైఫ్ను విరాట్ యూజ్ చేసుకున్నాడు. కిషన్ టాప్ గేర్లోకి రావడంతో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతడిని ఎంకరేజ్ చేశాడు. కెప్టెన్ ప్రోద్బలంతో యంగ్ ఓపెనర్ స్వేచ్ఛగా షాట్లు కొట్టాడు. టామ్ కరన్ బౌలింగ్లో 6, 4, 4 బాదడంతో పవర్ప్లేలో 50 రన్స్ వచ్చాయి. ఆపై, స్టోక్స్ బౌలింగ్లో ఫ్రీ హిట్కు కోహ్లీ సిక్స్ రాబట్టగా.. ఇషాన్ స్టన్నింగ్ పుల్షాట్తో బాల్ను స్టాండ్స్కు పంపాడు. ఆదిల్ రషీద్ వేసిన ఎనిమిదో ఓవర్లో కిషన్ ఇచ్చిన క్యాచ్ను లాంగాన్లో స్టోక్స్ డ్రాప్ చేశాడు. అప్పటికి 40 రన్స్ వద్ద ఉన్న ఇషాన్.. రషీద్ తర్వాతి ఓవర్లోనే వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టి 30 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, రివర్స్ హూక్ ఆడే ప్రయత్నంలో అదే ఓవర్లో ఎల్బీ అవడంతో సెకండ్ వికెట్కు 94 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. కానీ, ఈ ఆనందం ఇంగ్లండ్కు ఎంతోసేపు లేకుండా పోయింది. ఓ లెఫ్టాండర్ను ఔట్ చేస్తే అతని ప్లేస్లో వచ్చిన మరో లెఫ్టాండర్ రిషబ్ పంత్ దంచికొట్టాడు. ఆడింది 13 బాల్సే అయినా ధనాధన్ షాట్లతో పంత్ మ్యాచ్ను వన్సైడ్ చేసేశాడు. జోర్డాన్ బౌలింగ్లో 4,6 బాదిన అతను మరో షాట్ కొట్టే ప్రయత్నంలో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి 14వ ఓవర్లకు 133/3తో ఇండియా పటిష్ట స్థితిలో నిలిచింది. టామ్ కరన్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ను క్లాసిక్ షాట్తో డీప్ మిడాఫ్ మీదుగా సిక్స్ కొట్టిన కోహ్లీ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అదే ఊపుతో జోర్డాన్ బౌలింగ్లో 4,6తో మ్యాచ్ను ముగించాడు.

