న్యూఢిల్లీ: భారత సైన్యం కదలికలను గమనించేందుకు పాకిస్తాన్ గూఢచారి సంస్థ (ఐఎస్ఐ) భారీ కుట్ర పన్నింది. సరిహద్దు రాష్ట్రాల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో సోలార్ తో నడిచే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా లైవ్ ఫుటేజీని పాక్ హ్యాండ్లర్లకు చేరవేస్తున్న 11 మంది సభ్యుల ముఠాను ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని కపుర్తలా, జలంధర్, పఠాన్‌కోట్, పాటియాలా, మోగా, హర్యానాలోని అంబాలా, జమ్మూ కశ్మీర్‌లోని కథువా, రాజస్తాన్‌లోని బికనీర్, అల్వార్ లో ఈ రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు.
వీటిలో నకిలీ గుర్తింపు కార్డులతో తీసుకున్న సిమ్‌కార్డులను అమర్చి మొబైల్ యాప్‌ల ద్వారా లైవ్ ఫుటేజీని నేరుగా పాకిస్తాన్‌కు పంపేవారు. కేవలం నిఘా పెట్టడమే కాకుండా భవిష్యత్‌లో ఉగ్రదాడులు, సరిహద్దు చొరబాట్లకు ప్రణాళికలు వేయడానికి సైన్యం కదలికల సరళిని అర్థం చేసుకోవడం వీరి ఉద్దేశ్యం. పోలీసులు రెండు దశల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మొత్తం 11 మందిని పట్టుకున్నారు. వీరి దగ్గరి నుంచి 9 సీసీ కెమెరాలు, 4 పిస్టల్స్, 24 తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
