చంద్రుడిపై ల్యాండర్‌‌‌‌ను దింపితీరుతాం: ఇస్రో చైర్మన్‌‌ శివన్‌‌

చంద్రుడిపై ల్యాండర్‌‌‌‌ను దింపితీరుతాం: ఇస్రో చైర్మన్‌‌ శివన్‌‌

చంద్రయాన్ 2తోనే కథ ముగిసిపోలే 
చందమామపై అడుగుపెట్టే విషయంలో ఇండియా ప్రయత్నాలు ఇంతటితో ఆగిపోవు. చంద్రయాన్ 2తోనే కథ ముగిసిపోలేదు. సమీప భవిష్యత్తులోనే చంద్రుడిపై ల్యాండర్‌‌ను దింపి తీరుతాం” అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్​ డాక్టర్ కె. శివన్ అన్నారు. శనివారం ఐఐటీ ఢిల్లీ గోల్డెన్ జూబ్లీ కాన్వొకేషన్ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘చంద్రయాన్ 2 మిషన్‌‌లో సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయాం. కానీ విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి 300 మీటర్ల ఎత్తు వరకూ ఎలాంటి సమస్య లేకుండా దిగింది. అన్నీ మనం అనుకున్నట్లే జరిగాయి.  ఇస్రో తన అపారమైన అనుభవం, తెలివి, టెక్నికల్ కెపాసిటీని ఉపయోగించి సమీప భవిష్యత్తులోనే సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చూపిస్తుంది” అని శివన్ చెప్పారు.  ప్రస్తుతం గగన్‌‌యాన్, ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్‌‌పైనే దృష్టి పెట్టామన్నారు. వచ్చే కొన్ని నెలల్లో పెద్ద సంఖ్యలో అడ్వాన్స్‌‌‌‌డ్ శాటిలైట్లను ప్రయోగించేందుకు ప్లాన్ చేశామని తెలిపారు. డిసెంబర్ లేదా జనవరిలో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ) రాకెట్ తొలి ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 200 టన్నుల సెమీ క్రయో ఇంజన్ టెస్టింగ్ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. మన సొంత నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ ను మొబైల్ ఫోన్లలో ఉపయోగించేందుకు కూడా ప్రక్రియ మొదలైందని తెలిపారు. ఐఐటీలు టెక్నికల్ ఎడ్యుకేషన్‌‌కు ‘అక్షయ పాత్ర’ వంటివని శివన్ అన్నారు. అవకాశాలను వాడుకోవడంలో పాత తరాల వాళ్ల కంటే ఈ తరం వాళ్లు తెలివిగా ఉన్నారన్నారు.

చంద్రుడి వాతావరణంలో ‘ఆర్గాన్ 40’

చంద్రయాన్ 2 ఆర్బిటర్ మరో కీలక సమాచారాన్ని పంపింది. జాబిల్లి వాతావరణంలో ఆర్గాన్ 40 వాయువు ఉనికిని గుర్తించింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్‌‌లో ఉన్న ‘చంద్రాస్ అట్మాస్పెరిక్ కాంపొజిషన్ ఎక్స్ ప్లోరర్ 2 (చేజ్‌‌ 2)’ పేలోడ్ దీనిని గుర్తించిందని ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. ఈ వాయువు టెంపరేచర్లు, ప్రెజర్లను బట్టి రాత్రిపూట చంద్రుడి ఉపరితలంపై చాలా దట్టంగా ఉంటోందని, పగలు అయ్యేసరికి ఇది తేలికగా మారి చంద్రుడి వాతావరణంలోని ఎక్సో స్పియర్‌‌కు చేరుతోందని కనుగొంది. వాస్తవానికి ఇది ఆర్గాన్ మూలకానికి ఉన్న ఐసోటోప్ (మారురూపం)లలో ఒకటి. చంద్రుడి నేలలో చాలా లోతున పొటాషియం 40 మూలకం రేడియోయాక్టివ్ డిసింటిగ్రేషన్‌‌కు గురికావడం వల్ల ఆర్గాన్ 40 ఏర్పడుతోందని, చంద్రుడి ఉపరితలంలోని పగుళ్ల ద్వారా వాతావరణంలోకి వెళ్తోందని సైంటిస్టులు చెప్పారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి