ముంబైలో గాలి దుమారం..14కు చేరిన మృతుల సంఖ్య

ముంబైలో గాలి దుమారం..14కు చేరిన మృతుల సంఖ్య
  • కొనసాగుతున్న రెస్క్యూ అండ్​ సెర్చ్ ఆపరేషన్
  • యాడ్ ఏజెన్సీ యజమానిపై కేసు నమోదు
  • బాధిత ఫ్యామిలీలకు రూ.5 లక్షల సాయం ప్రకటించిన మహారాష్ట్ర సీఎం షిండే

ముంబై : మహారాష్ట్రలోని ముంబైలో  హోర్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాలతో ఆస్పత్రిలో చేరిన వారిలో 32 మంది డిశ్చార్జ్ అయ్యారు. హోర్డింగ్ కింద నుంచి ఇప్పటిదాగా  మొత్తం 89 మందిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే, రెస్క్యూ & సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని..బాధితుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ తెలిపారు.

బలమైన ఈదురు గాలుల ధాటికి ఘట్ కోపర్ లోని  100 అడుగుల హోర్డింగ్ కూలి పక్కనే ఉన్న పెట్రోల్ పంపుపై పడిందన్నారు. హోర్డింగ్ పడటంతో నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొందరు చిక్కుకుని ఉన్నారని తెలిపారు. 100 మంది సిబ్బందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లలో పాల్గొన్నాయని చెప్పారు. పక్కనే పెట్రోల్ పంపు ఉన్నందున12 ఫైర్ ఇంజన్లు కూడా  ఆపరేషన్‌‌లో చేరాయన్నారు.

రెండు హెవీ డ్యూటీ క్రేన్‌‌లు, రెండు క్రేన్‌‌లు, 25 అంబులెన్స్‌‌లు ఆపరేషన్‌‌లో  ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ యాడ్ ఏజెన్సీ యజమాని భవేశ్ భిండేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

అక్రమ హోర్డింగ్‌‌ల తొలగింపు

ఘట్‌‌కోపర్‌‌ ఘటనతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అప్రమత్తమయ్యింది. సిటీలోని అన్ని హోర్డింగ్‌‌లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఏర్పాటు చేసిన వాటితో పాటు ముప్పు పొంచి ఉన్న వాటిని తొలగించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీ) ల్యాండ్‌‌లో హోర్డింగ్ కూలిన చోట ఉన్న మిగిలిన హోర్డింగ్‌‌లను కూడా కచ్చితంగా తొలగించాలని తెలిపింది. గరిష్టంగా 40x40 చదరపు అడుగుల విస్తీర్ణంలో హోర్డింగ్‌‌లకు మాత్రమే బీఎంసీ అనుమతించిందని..

అయితే, కొందరు 120x120 చదరపు అడుగుల విస్తీర్ణంలో  అక్రమంగా హోర్డింగ్స్ పెట్టారని వివరించింది. కాగా..మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.