అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండో విడత పాలనలో భాగంగా 'అమెరికా ఫస్ట్' విధానాన్ని దూకుడుగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే వస్తువులపై భారీగా సుంకాలు (టారిఫ్స్) విధించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% బేస్‌లైన్ సుంకంతోపాటు, కొన్ని దేశాలపై (భారత్ 50%, బ్రెజిల్ 50%, చైనా 30%) భారీ సుంకాలు విధించారు. దీనిని సవాలు చేస్తూ అనేక వ్యాపార సంస్థలు, డెమోక్రటిక్ రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి.(ఇటీవల జరిగిన భారత్ అమెరికా ఒప్పందంలో భాగంగా 50శాతంగా ఉన్న టారిఫ్‌లను 18శాతానికి అమెరికా అంగీకరం తెలిపింది. అందుకు అనుగుణంగా అమెరికా దిగుమతులపై భారత్ సున్నా శాతం టారిఫ్‌లకు ఒప్పకుంది.) పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు మాత్రమే ఉంటుంది, అధ్యక్షుడికి కాదు. అయితే, ట్రంప్ ఏకపక్ష నిర్ణయానికి అమెరికా సుప్రీంకోర్టు ఫిబ్రవరి 2026లో బ్రేక్ వేసింది. ట్రంప్ విధించిన ఈ 'స్వీపింగ్ టారిఫ్స్' రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చి చెప్పడం ప్రపంచ వాణిజ్య చరిత్రలో ఒక కీలక మలుపుగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, ట్రంప్ మళ్లీ 15శాతం టారిఫ్‌లను ప్రకటించారు.
ఈ సుంకాలు కేవలం ఆర్థిక సాధనాలుగానే కాక, ఇతర దేశాలపై రాజకీయ వ్యూహాత్మక ఒత్తిడి తెచ్చే శక్తిమంతమైన ఆయుధాలుగా కూడా ఉపయోగించడం జరిగింది. భాగస్వామ్య దేశాల వాణిజ్య, విదేశాంగ విధానాల్లో అమెరికాకు అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి ఈ టారిఫ్‌లను ఒక 'ఒత్తిడి సాధనం'గా ప్రయోగించారు. ఈ వ్యూహం భౌగోళిక రాజకీయ లక్ష్యాలతో ముడిపడి ఉంది. ఉదాహరణకు రష్యా వంటి దేశాల నుంచి చమురు లేదా ఇతర కీలక వనరులను కొనుగోలు చేసే దేశాలపై పరోక్షంగా ఈ సుంకాల ద్వారా ఒత్తిడి పెంచడం జరిగింది. ఇలా అంతర్జాతీయ వ్యూహాత్మక సమీకరణాలను అమెరికాకు అనుకూలంగా ప్రభావితం చేయడం ద్వారా ప్రపంచ వాణిజ్య వేదికపై తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని ట్రంప్ యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రధానంగా రాజ్యాంగ నియమాలను ప్రస్తావించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం కేవలం అక్కడి పార్లమెంటు అయిన 'కాంగ్రెస్'కు మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడు అత్యవసర పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ, వాణిజ్య లోటును సాకుగా చూపిస్తూ ఇష్టారాజ్యంగా సుంకాలు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.
ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాలు
ట్రంప్ 1977 నాటి 'ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్' ను ఉపయోగించి ఈ సుంకాలు విధించారు. సాధారణంగా యుద్ధ సమయంలో లేదా తీవ్ర జాతీయ భద్రతా సమస్యలు ఉన్నప్పుడు శత్రు దేశాల ఆస్తులను స్తంభింపజేయడానికి ఈ చట్టం వాడతారు. కానీ, ‘వాణిజ్య లోటు’ అనేది జాతీయ అత్యవసర పరిస్థితి కాదని కోర్టు తేల్చి చెప్పింది. విశేషమేమిటంటే.. ట్రంప్ స్వయంగా నియమించిన ఇద్దరు జడ్జిలు కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును ‘హాస్యాస్పదమైనది’ అని విమర్శిస్తూ, దేశ వాణిజ్య లోటును తగ్గించడానికి ఈ 15% సుంకం అవసరమని ట్రంప్ వాదిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన కొద్దిగంటల్లోనే ట్రంప్ వెనక్కి తగ్గకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వెతికారు. కోర్టు కొట్టేసిన పాత చట్టానికి బదులుగా, 1974 ట్రేడ్ యాక్ట్‌లోని 'సెక్షన్ 122'ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వస్తువులపై 10 నుంచి 15 శాతం వరకు తాత్కాలిక దిగుమతి సుంకాన్ని
విధిస్తున్నట్లు ప్రకటించారు.
సుంకాల వివాదం
డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల వివాదం కేవలం దిగుమతి పన్నులకో, లేదా ధరల పెరుగుదలకో పరిమితమైనది కాదు. ఇది అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య విధానం, రాజ్యాంగ చట్టాల మధ్య జరుగుతున్న ఒక సంక్లిష్టమైన యుద్ధం. ట్రంప్ సుంకాలను కేవలం ఆదాయం కోసం కాకుండా, ఇతర దేశాల విదేశాంగ విధానాలను శాసించడానికి ఒక 'రాజకీయ అస్త్రం'గా వాడుతున్నారు. ఉదాహరణకు రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనడాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నది అమెరికా వ్యూహం. భారత్, రష్యా నుంచి చమురు కొనడం ఆపకపోతే, దానికి ప్రతిగా భారతీయ వస్తువులపై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించడం ఒక స్పష్టమైన భౌగోళిక రాజకీయ ఒత్తిడి. అంటే, ఇక్కడ వాణిజ్యం అనేది ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే సాధనంగా మారింది. అమెరికా 'స్వేచ్ఛా వాణిజ్యం' నుంచి 'రక్షణ వాణిజ్యం' వైపు మళ్లుతోంది. దేశీయ తయారీ రంగాన్ని కాపాడటం, విదేశీ వస్తువుల ఆధిపత్యాన్ని తగ్గించడం ద్వారా అమెరికాలో ఉపాధిని పెంచాలన్నది ట్రంప్ వాణిజ్య విధానం. ముఖ్యంగా చైనా వంటి దేశాల ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించడం ద్వారా, గ్లోబల్ సప్లై చైన్ నుంచి చైనాను వేరు చేసి, ఆ స్థానాన్ని అమెరికా కంపెనీలు భర్తీ చేయాలన్నది వారి లక్ష్యం. ఇది కేవలం పన్నుల పెంపు కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దిశను మార్చే ప్రయత్నం.
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందే..
భారత్ ఒప్పందం చేసుకొని ఉంటే
మెరుగ్గా ఉండేది!
ఇప్పటికే వసూలు చేసిన సుమారు 175 నుంచి 250 బిలియన్ డాలర్ల సుంకాలను తిరిగి చెల్లిస్తారా? ఇది సుదీర్ఘ కాలం కోర్టుల్లో నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ వంటి దేశాలతో జరిగిన ఒప్పందాల పరిస్థితి ఏమిటి అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ భారత్ మరికొన్ని రోజులు వేచి ఉంటే, ఈ కోర్టు తీర్పు తర్వాత అమెరికాతో మరింత మెరుగైన ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉండేది. కెనడా, బ్రెజిల్ వంటి దేశాలు ఇంకా ఒప్పందాలు చేసుకోకపోవడం వల్ల వాటికి ఇప్పుడు చర్చల్లో బలం పెరిగింది. ట్రంప్ తన వాణిజ్య విధానాన్ని ఉపయోగించి ప్రపంచ దేశాలను తన భౌగోళిక రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా మార్చుకోవాలని చూశారు. అయితే, అమెరికా రాజ్యాంగ చట్టం ఆ ప్రయత్నానికి చట్టపరమైన అడ్డంకిగా నిలిచింది. ఈ మూడు అంశాల కలయికే ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితికి ప్రధాన కారణం. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమైన ప్రజా స్వామ్యానికి విజయం అని చెప్పవచ్చు. అయితే, ట్రంప్ తన మొండివైఖరితో కొత్త మార్గాల్లో సుంకాలు విధిస్తుండటం వల్ల అనిశ్చితి కొనసాగుతోంది. భారతదేశం ఇప్పుడు తన దౌత్య సామర్థ్యాన్ని ఉపయోగించి, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో చర్చలు జరిపి శాశ్వత మినహాయింపులు పొందాలి. ముఖ్యంగా ఫార్మా (మందులు), సెమీకండక్టర్లు వంటి రంగాలకు ఇప్పటికే కొన్ని మినహాయింపులు ఉన్నాయి, వాటిని ఇతర రంగాలకు కూడా వర్తింపజేయడం భారత్ ముందున్న సవాలు. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా, ఐరోపా, ఆసియా మార్కెట్లను విస్తరించుకోవడం ఇప్పుడు భారత్ ముందున్న ఏకైక మార్గం.
15శాతం టారిఫ్‌లు కూడా చిక్కుల్లో పడే అవకాశం!
1974 ట్రేడ్ యాక్ట్ లోని ‘సెక్షన్ 122’ని సెక్షన్‌ప్రకారం అధ్యక్షుడు గరిష్టంగా 150 రోజులపాటు సుంకాలు విధించవచ్చు. ఆ తర్వాత దీనిని పొడిగించాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. సుప్రీంకోర్టు తీర్పు వల్ల గతంలో ఉన్న భారీ సుంకాలు (50%) తగ్గినప్పటికీ, ట్రంప్ తన పట్టు వదలకుండా కొత్త రూపంలో భారాన్ని మోపుతున్నారు.
ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితిని కొనసాగిస్తోంది. అయితే, ఇది కూడా చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అలాగే సెక్షన్ 301 (అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్), సెక్షన్ 232 (నేషనల్ సెక్యూరిటీ) కింద ఇప్పటికే స్టీల్, అల్యూమినియం వంటి వాటిపై ఉన్న సుంకాలు కొనసాగుతాయని తేలింది. సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ రాజకీయంగా, చట్టపరంగా బలహీనపడ్డారు. ఆయన పాపులారిటీ రేటింగ్స్ కూడా 40% కంటే కిందకు పడిపోయాయి.
- చిట్టెడ్డి కృష్ణారెడ్డి
అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్‌సీయూ
