చివరి గింజ వరకు ధాన్యం కొనాల్సిందే : బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు

చివరి గింజ వరకు ధాన్యం కొనాల్సిందే : బీజేపీ స్టేట్చీఫ్ రాంచందర్ రావు
  • బీజేపీ స్టేట్​చీఫ్ రాంచందర్ రావు డిమాండ్​
  • సేకరణ స్పీడప్ చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తమని వార్నింగ్
  • కుల్కచర్ల, గజ్వేల్​లో ​‘రైతు గోస– బీజేపీ భరోసా’ యాత్ర

వికారాబాద్/ సిద్దిపేట, వెలుగు: రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు డిమాండ్ చేశారు. వేగంగా కొనుగోళ్లు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని, రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని హెచ్చరించారు. ‘రైతు గోస– బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా సోమవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును, సిద్దిపేట జిల్లా గజ్వేల్ రింగ్ రోడ్డుపై కుప్పలుగా పోసిన ధాన్యం, మక్కలను పరిశీలించారు.

గజ్వేల్ మార్కెట్ యార్డులో పేరుకుపోయిన ధాన్యం, మక్కల రాశులను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని, ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నట్టు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా అబద్ధమని మండిపడ్డారు. ఇప్పటివరకు కేవలం 30 శాతం మాత్రమే కొనుగోలు చేశారని, ఇంకా 70 శాతం కొనాల్సి ఉందని ఆరోపించారు. మొత్తం ధాన్యం కొంటామని చెప్పి ఇప్పుడు కొంత మాత్రమే కొని ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని విమర్శించారు.

బాధ్యత లేని ప్రభుత్వం: ఈటల 

రైతుల పట్ల ఇంత దుర్మార్గంగా, బాధ్యత లేకుండా వ్యవహరించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రెండు నెలలుగా కల్లాల్లోనే వరి ధాన్యం ఉన్నా కంటాలు కావడం లేదని, కంటాలైనవి రైస్ మిల్లులకు పోవడం లేదని ఫైరయ్యారు. రాష్ట్రంలో రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలను వదిలేసి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ అంటూ జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

రైతులను రోడ్డున పడేశారు: విశ్వేశ్వర్ రెడ్డి

రైతులను పూర్తిగా రోడ్డు మీద పడేశారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. మరో రెండు మూడు రోజుల్లో ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆగమాగమవుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రైస్ మిల్లర్ల దురాగతాలకు అదుపు లేదన్నారు.

రాత్రికి రాత్రే సంచులు తెచ్చారు: ఏలేటి 

బీజేపీ నాయకులు వస్తున్నారని తెలిసి నిన్న రాత్రికి రాత్రే గన్నీ సంచులు తెచ్చారని బీజేపీ శాసనపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తూకంలో సంచికి 4 కిలోలు అదనంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు.