పాలిటెక్నిక్ కాలేజీల్లో 33,140 సీట్లు

పాలిటెక్నిక్ కాలేజీల్లో 33,140 సీట్లు
  • రేపటి నుంచే ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్లకు కౌన్సెలింగ్  
  • 111 కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ రిలీజ్  
  • జూన్ 6న తొలి విడత సీట్ల కేటాయింపు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం షెడ్యూల్ రిలీజ్ అయింది. టీజీ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ బుధవారం  నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫస్ట్ ఫేజ్​లో భాగంగా ఈనెల 27 నుంచి 31 వరకు అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 29 నుంచి జూన్ 1 వరకు హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు మే 29 నుంచి జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అభ్యర్థులు కోరుకున్న కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యతను బట్టి జూన్ 6న లేదా అంతకంటే ముందే సీట్లను కేటాయించనున్నారు. 

33 వేలకు పైగా సీట్లు.. 

ఈ ఏడాది మొత్తం 111 పాలిటెక్నిక్ కాలేజీల్లో 33,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 59 సర్కారు కాలేజీల్లో 18,788 సీట్లు ఉండగా, 52 ప్రైవేట్ కాలేజీల్లో 14,352 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 2,930 సీట్లు కేటాయించారు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన సెమీ కండక్టర్ టెక్నాలజీలో 720 సీట్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కంప్యూటర్ సైన్స్ లో అత్యధికంగా 6,490 సీట్లు, ఈఈఈలో 5,385, ఈసీఈలో 5,305, మెకానికల్ ఇంజినీరింగ్ లో 3,480, సివిల్ ఇంజినీరింగ్ లో 3,360 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు తమకు సమీపంలోని సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంచుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం https://tgpolycet.nic.in వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాలని తెలిపారు.