అడ్డాకుల, వెలుగు: మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన ఆర్టీసీ బస్సును కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే మహిళలను పెట్రోల్ బంకుల ఓనర్లను చేశామని, ఆర్టీసీలో వెయ్యి బస్సులను మహిళలకు కేటాయించామని చెప్పారు.
సంపద సృష్టికర్తలుగా ఎదగాలి
వనపర్తి/కొత్తకోట: మహిళలు సంపద సృష్టికర్తలుగా మారి, ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కొత్తకోటలో నిర్వహించిన మహిళా శక్తి వారోత్సవాల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పాల్గొన్నారు. మిరాశిపల్లి శివారులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తకోట, మదనాపూర్ మండల మహిళా సమాఖ్యలకు కేటాయించిన రెండు ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. 33 మందికి కల్యాణ లక్ష్మి, ఇద్దరికి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ అరుణ, ఏఎంసీ చైర్మన్ ప్రశాంత్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సునీత పల్లవి, డీఆర్డీవో ఉమాదేవి పాల్గొన్నారు.
