గ్రేటర్ సమస్యలపై ఫోకస్..వరంగల్‍ సిటీలో డివిజన్ల బాట పట్టిన ‘హస్తం’ నేతలు 

గ్రేటర్ సమస్యలపై ఫోకస్..వరంగల్‍ సిటీలో డివిజన్ల బాట పట్టిన ‘హస్తం’ నేతలు 
  • పశ్చిమలో ఎమ్మెల్యే 'మన వాడకు.. మన నాయిని' ప్రోగ్రాం
  • అధికారులతో కలిసి రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం  
  • వేసవి నేపథ్యంలో తాగునీటి సప్లై, గ్రీనరీపై మేయర్‍ అడుగులు
  • వాటర్‍ ట్యాంకుల వద్ద ఆకస్మిక తనిఖీలు

వరంగల్‍, వెలుగు:  గ్రేటర్‍ వరంగల్‍ సమస్యలపై అధికార కాంగ్రెస్​ పార్టీ నేతలు స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. ఇందులో భాగంగా సిటీ ఎమ్మెల్యేలు వివిధ శాఖల అధికారులను వెంటేసుకుని డివిజన్ల బాట పట్టారు. స్థానికులతో మమేకమవుతూ కాలనీలవారీగా జనాలు ఎదుర్కొంటున్న సమస్యలను రిపోర్ట్​తయారు చేస్తున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరిస్తుండగా, మిగతావాటికి ప్రపోజల్స్​ పంపేలా ఆదేశాలిస్తున్నారు. ప్రధానంగా ఏండ్ల తరబడి పాలకులు ముట్టుకోని డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రోడ్లు ఉంటుండగా, ఏటా వేసవికాలంలో వచ్చే నీటి ఎద్దడికి చెక్​పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

తాగునీటి సప్లై, లీకేజీలపై మేయర్‍ ఫోకస్‍.. 

గ్రేటర్‍ వరంగల్​లో ఏటా వేసవి కాలంలో తాగునీటి సరఫరాలో కొంత ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అటువంటి సమస్య రావొద్దనే ఆదేశాలతో మేయర గుండు సుధారాణి ముందస్తుగా చర్యల కోసం డివిజన్ల బాట పడుతున్నారు. అధికారులతో రివ్యూలు చేపట్టి ఎప్పటికప్పుడూ ట్యాంకుల నిలువ స్థితి, పంపింగ్‍ విధానం, పైపులైన్ల లీకేజీలు, మోటర్‍ సామర్థ్యం, విద్యుత్‍ సప్లైపై సమాచారం తెలుసుకుంటున్నారు. వడ్డెపల్లి ఫిల్టర్‍ బెడ్‍ను పరిశీలించారు. 

నీటి శుద్ధీకరణ తీరు చూశారు. నగరానికి ధర్మసాగర్‍ నుంచి నీటి సరఫరా జరుగుతున్న క్రమంలో లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుని సమ్మర్‍లో ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. సిబ్బంది పనితీరు తెలుసుకోడానికి ఆదివారం రాత్రి 10 గంటలు దాటాక మేయర్‍ స్వయంగా వరంగల్‍ శంభునిపేట క్రాస్‍లోని వాటర్‍ ట్యాంక్‍ వద్దకెళ్లి పనితీరు తెలుసున్నారు. ఇవేగాక గ్రేటర్‍లోని ప్రధాన పార్కులు, మీడియన్‍ జంక్షన్లలో గ్రీనరీ ఎట్టిపరిస్థితుల్లో తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వానాకాలంలో వరద ఇబ్బందులు రాకుండా శానిటేషన్‍ విషయంలోనూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. చేయాల్సిన పనులు వేసవిలో పూర్తిచేసేలా చొరవ చూపుతున్నారు. మంత్రి కొండా సురేఖ తూర్పు నియోజకవర్గంలో రెగ్యూలర్‍ పర్యటనలు చేస్తూ గ్రేటర్ సమస్యలపై అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.  

పశ్చిమలో ఎమ్మెల్యే స్పెషల్‍ ప్రోగ్రాం..

గ్రేటర్‍ వరంగల్‍ ప్రధానంగా వరంగల్‍ పశ్చిమ, రంగల్‍ తూర్పుతో పాటు వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఈ క్రమంలో వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ''మన వాడకు.. మన నాయిని” పేరుతో స్పెషల్‍ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. తన పరిధిలోని 26 డివిజన్ల బాట పట్టారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులను వెంటపెట్టుకుని రోజుకో డివిజన్‍ కాలనీల్లో తిరుగుతూ, స్థానికులతో కలిసి సమస్యలను తెలుసుకుంటున్నారు.  ఈ సందర్భంగా గడిచిన రెండేళ్లలో డివిజన్‍లో చేపట్టిన అభివృద్ధిని వివరించి..  చేపట్టాల్సిన పనులను అక్కడికక్కడే క్లియర్‍ చేస్తున్నారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు ఉండేలా కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.