- బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం
- జిల్లాలో 58 సెంటర్లలో పరీక్షల నిర్వహణ
- హాజరుకానున్న 36,963 మంది విద్యార్థులు
- సీసీ కెమెరాలతో ఇంటర్ బోర్డు మానిటరింగ్
- ఎగ్జామ్ టైంకు బస్సులు నడిపించాలని కలెక్టర్ ఆదేశం
నిజామాబాద్, వెలుగు: ఇంటర్‌పరీక్షల నిర్వహణకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా జిల్లాలో 58 సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 36,963 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 31,229 మంది, ఒకేషనల్ విద్యార్థులు 5,734 మంది ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఫ్టస్ ఇయర్ స్టూడెంట్స్ 16,336 మంది ఉండగా, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్14,893 మంది ఉన్నారు.
ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ 2,963 మంది, సెకండ్ ఇయర్ 2,771 మంది ఉన్నారు. 90 రోజుల ప్రణాళికతో ప్రత్యేక తరగతులు తీసుకొని విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశారు. కాపీయింగ్‌కు తావులేకుండా ప్రతి సెంటర్లో మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటర్‌బోర్డుకు లింక్చేశారు. లోపాలు ఉంటే అధికారులు పరీక్షా కేంద్రాలను మానిటరింగ్చేసేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ప్రశ్నాపత్రాలనూ సీసీ కెమెరాల నిఘాలో భద్రపరిచారు.
హాల్‌టికెట్లు నేరుగా పేరెంట్స్ ఫోన్లకు..
ప్రైవేట్ కాలేజీల ఫీజుల సమస్యల కారణంగా హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా ఈసారి బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. హాల్‌టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు నేరుగా పంపించారు. అవసరమైతే కాలేజీ కోడ్‌తో ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. హాల్‌టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌తో పరీక్షా కేంద్రం వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
అక్రమాలకు తావు లేకుండా నిఘా..
జిల్లాకు చేరిన ప్రశ్నా పత్రాలను సీసీ కెమెరాల నిఘా మధ్య భద్రపర్చారు. వాటిని ఓపెన్ చేసేటప్పుడు కూడా బోర్డ్ ఆదేశాల ప్రకారం జాగ్రత్తలు పాటిస్తారు. ప్రతి పరీక్షా సెంటర్‌కు డిపార్ట్మెంట్ ఆఫీసర్‌ను బోర్డ్ నియమించింది. ఆయన అజమాయిషీలో చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు పని చేయనున్నారు. ప్రతి సెంటర్లో మూడు సీసీ కెమెరాలు పెట్టి ఒకదానిని బోర్డ్‌కు లింక్ చేయడం వల్ల ఉన్నతాధికారులు పర్యవేక్షించేందుకు వీలుకలిగింది. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే మూడేళ్ల పాటు డిబార్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నారు. పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం బోర్డు టోల్‌ఫ్రీ నంబర్ 14416 అందుబాటులో ఉంచింది.
విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు ..
ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు రోజు విడిచి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రాల్లో జిల్లాయంత్రాంగం మౌలిక వసతులను కల్పించింది. ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌సరఫరా చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి వసతితో పాటు విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే చూసేందుకు ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లను నియమించారు. పరీక్షా సమయానికి 15 నిమిషాలకు ముందే సెంటర్ల వద్దకు చేరుకునేలా మారుమూల గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు.
ఉత్తీర్ణత శాతం పెంచుతం
ఇంటర్ ఫైనల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. గతేడాది 58 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను చదివించాం. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. -రవికుమార్, డీఐఈవో
